మేడ్చల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో నీటి తిప్పలు తప్పడం లేదు. వానాకాలం పూర్తయ్యే సమయం దగ్గర పడుతున్న వర్షాలు ఈ సీజన్లో అంతంత మాత్రంగానే పడటంతో జిల్లా అంతటా నీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికింకా వాటర్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ఎండాకాలం నుంచి ప్రారంభమైన వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. లోటు వర్షపాతం నమోదుతో బోరుబావులు రీఛార్జి కాకపోవడంతో నీటి కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
5 వేల లీటర్ల నీటికి రూ. 6 వందల నుంచి రూ. 8 వందలు చెల్లించాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో వానాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజు వరకు సాధారణ వర్షపాతం 584.8 మిల్లీమిటర్ల కాగా ఇప్పటి వరకు 407.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై 30 శాతం వర్షపాతం లోటుగా ఏర్పడింది. దీంతో భూగర్భజలాల మట్టం పెరగిపోవడంతో బోరుబావులు రీఛార్జికాక నీటి తిప్పలు తప్పడం లేదు.
జిల్లా అధికారులు నీటి ఎద్దడి నివారణలో జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎద్దడిని నివారించుకునేందుకు ప్రజలు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో యజమానులు ధరలు పెంచుతున్నారు. యజమానులను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ సర్కిళ్ల నుంచి వాటర్ ట్యాంకర్లను తక్కువ ధరలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.