Odela | ఓదెల, మే 24 : పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించగా, ఇంజనీర్లు తప్పిదం వల్ల వర్షాకాలంలో అండర్ బ్రిడ్జిలు నిరుపయోగం అవుతున్నాయి. ఇందుకు ఓదెల మండల కేంద్రంలో నిర్మించిన అండర్ బ్రిడ్జి నిదర్శనంగా నిలుస్తుంది. శనివారం తెల్లవారుజాము కురిసిన ఒక్క వర్షానికి వరద నీటితో అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచి రాకపోకలు నిలిచాయి.
ఇలా ఓదెల మండలంలో ఓదెల, హరిపురం, ఉప్పరపల్లి, కొత్తపల్లి జిల్లాలో నిర్మించిన అండర్ బ్రిడ్జిలు రాకపోకలకు సౌకర్యంగా లేవు. ఈ కారణంగా ప్రయాణికులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జిల కారణంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, దూరప్రాంతాల నుంచి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది. అండర్ బ్రిడ్జిలు ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఉండేలా చూడాలని ప్రజలు రైల్వే ఉన్నతాధికారులను కోరుతున్నారు.