భీమ్‌గల్, ఫిబ్రవరి 19: మున్సిపల్ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ ప్రజల పక్షమేనని, వారి కోసమే పని చేస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తుందని చెప్పారు. పట్టణంలోని ఎల్జే గార్డెన్స్‌లో గురువారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో వేముల మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెగా ఉన్న భీమ్‌గల్ పట్టణ రూపు రేఖలు మార్చడానికి ఎనలేని కృషి చేశానని తెలిపారు.
పట్టణంలోని 80 శాతం గల్లీల్లో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు చెప్పారు. పట్టణ శోభను తీసుకురావడానికి రెండున్నర కిలో మీటర్ల పొడవుతో అన్ని మెయిన్ రోడ్లను సెంట్రల్ లైట్లు, డివైడర్లతో నాలుగు లైన్ల రహదారిగా నిర్మించామని తెలిపారు. పార్కులను అభివృద్ధి చేసి అందులో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి వాటి రక్షణ చర్యలు చేపట్టామని వివరించారు. రూ. 40 కోట్లతో వంద పడకల దవాఖాన, రూ. 6 కోట్లతో మార్కెట్ యార్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. మూసేసిన బస్ డిపో ను తెరిపించడంతోపాటు అన్ని స్మశానవాటికలను అభివృద్ధి చేశామన్నారు.
వంద పడకల దవాఖానను అందుబాటులోకి తేవాలి
రూ. కోట్ల రూపాయలతో ప్రార్థనా మందిరాలతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయినప్పటికీ పట్టణ ప్రజలు తమ మీద చూపించాల్సిన స్థాయిలో దయ చూపలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలువకున్నా, స్థానిక ఎమ్మెల్యేగా తాను, గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి పట్టణ అభివృద్ధి కోసం తన సేవ ఇలాగే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రతిపక్ష పార్టీగా పోరాడుతూనే ఉంటామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో 80 శాతం పూర్తయిన వంద పడకల దవాఖానను త్వరగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. దాదాపు 70 శాతం నిర్మాణ పనులు పూర్తయిన మార్కెట్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
తాము తెరిపించిన బస్ డిపోను మళ్లీ మూసివేశారని, దాన్ని త్వరగా తెరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ. 11.5 కోట్ల పనులు సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలను రెండేండ్లు నిలిపివేసి ఎన్నికల సమయంలో మొదలుపెట్టారని, వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. విజయానికి పొంగిపోమని, అపజయానికి కుంగిపోమని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున తన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పనులన్నీ చేయించవచ్చని తాను ఆశించానని, అయినప్పటికీ ప్రజలు తాను ఆశించిన స్థానాలు ఇవ్వకున్నా, వారు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు ఆర్మూర్ మహేశ్, చౌట్పల్లి రవి, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, కౌన్సిలర్లు, మల్లెల అనుపమ ప్రసాద్, బొదిరె లావణ్య నర్సయ్య, గున్నాల బాల లక్ష్మి భగత్, నీలం రవి తదితరులు పాల్గొన్నారు.