హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అన్యాయం జరిగితే తాము మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ స్పష్టంచేశారు. న్యాయస్థానంలో వారు డిస్ క్వాలిఫై కావడం, పది చోట్ల మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం అనర్హత పిటిషన్‌ను గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించిన నేపథ్యంలో పిటిషనర్ అయిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అసెంబ్లీకి హాజరై శ్రీహరి పార్టీ మారినట్టు నిరూపించే కీలక ఆధారాలు సమర్పించారు.
అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తీర్పు కాపీలను స్పీకర్ తమకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డిని నమ్ముకునిపోతే కుక తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని కడియం శ్రీహరి తెలుసుకోవాలని హితవు పలికారు. కడియం మానసిక స్థితి సరిగా లేదని, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరి కూతురికి టికెట్ ఇప్పించి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారని చెప్పారు. శ్రీహరికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు. కేసీఆర్ కాళ్లు పట్టుకొని కడియం ఎంపీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. కారు గుర్తుపై గెలిచిన శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని వివేకానంద సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వివేకానందగౌడ్ హెచ్చరించారు. ఆ రోజు కేసీఆర్‌ను దేవుడు అని ప్రశంసించిన ఆయన.. కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారంటూ నేడు నాలుక మడతేయడంపై మండిపడ్డారు. రంగులు మార్చిన కడియం లాంటి వారికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన పదవులు అనుభవించిన కడియంకు ఇప్పుడు ఆయన కనిపించకుండా పోయారా? అని విమర్శించారు. కేసీఆర్ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి, పదవుల కోసం పాకులాడలేదని చెప్పారు. శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.