ఖలీల్వాడి, ఫిబ్రవరి 19: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులోని సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతిరోజు సగటున జరుగుతున్న ప్రసవాల సంఖ్య, మాతాశిశు మరణాలు ఏమైనా చోటు చేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహెచ్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు.
సమయపాలన పాటించాలి
మాతాశిశు సంరక్షణ దవాఖానను సైతం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. దవాఖానలోని అన్ని విభాగాలు, పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతిరావు తదితరులున్నారు.