siricilla | ఎల్లారెడ్డిపేట మార్చి 29: ప్రభుత్వం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు అసహనంగా ఉన్నతరణలో కనీసం ఈజీఎస్ రోడ్లు వేసి పరువు నిలబెట్టుకున్నామని ప్రయత్నం చేస్తుంటే ఇసుక రీచ్ గ్రామాల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నది. ప్రభుత్వం మారిన పిదప మండలంలోని వెంకటాపూర్ ముస్తాబాద్ మండలంలోని ఆవునూరుకు అధికారిక ఇసుక రీచ్ లను ప్రకటించారు దీంతో సహజంగానే నారాయణపూర్ సమీప గ్రామాల ప్రజలు ఇసుకను తెచ్చుకోవాలంటే వెంకటాపూర్ నుంచి తెచ్చుకోవాల్సి ఉండగా ఇదే అదునుగా వెంకటాపూర్ వాళ్లు ఒక్కో ట్రిప్పుకు రూ.3వేల నుంచి రూ. 3500 వరకు వసూలు చేస్తున్నారు.
ఇది మధ్యతరగతి వర్గాలకు కొంత ఇబ్బందులను తెస్తున్నది. ఇటీవల నారాయణపూర్ గ్రామస్తుల ఒత్తిడి మేరకు నారాయణపూర్ రాగట్లపల్లి ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్లు తమ రీచ్ కు అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ అధికారులు వెంకటాపూర్ నుంచి తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇటీవల నారాయణపూర్ ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్లు అక్కడకు వెళితే తమ రీచ్ లోకి రావద్దంటూ వెంకటాపూర్ గ్రామస్తులు అభ్యంతరం చెప్పి వెనక్కి పంపారు.
ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం ఆవునూరుకు అధికారికంగా రీచ్ ఉన్నప్పటికీ శనివారం వెంకటాపూర్ ట్రాక్టర్లను ఇసుకను ముస్తాబాద్ మండలం గూడెం కు తరలించేందుకు అధికారులు అనుమతించారు. దీంతో ఆవునూరు ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్లు వెంకటాపూర్ ట్రాక్టర్లను సుమారు 100 మంది అడ్డుకున్నారు. తమకు రూ.5 లక్షల వరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాలని, అవి ఇచ్చేవరకు ఏ ట్రాక్టర్లు రానివ్వమని అడ్డుకోవడంతో సదరు ట్రాక్టర్లను అధికారులను వెనక్కి పంపారు.
ఇసుకను ఎల్లారెడ్డిపేటలోని పలు గ్రామాలకు పంపేందుకు అధికారులు ప్రయత్నించడంతో నారాయణపూర్ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు వెంకటాపూర్ ట్రాక్టర్లు మా పరిధిలోకి రానివ్వమని రాగట్లపల్లిలో అడ్డుకోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు సదరు ట్రాక్టర్లు అక్కడ నుంచి కూడా వెనక్కి పంపారు. చేసేదేమి లేక ఇసుక రవాణా ను అధికారులు నిలిపి వేశారు. రోజురోజుకు ఇసుక పంచాయితీ గ్రామాల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.