ఎన్టీపీసీ బూడిద కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తున్నది. సమీప గ్రామాల ప్రజలు నిరంతరం కాలుష్యంతో సతమతమవుతుంటే.. ఇక్కడ మాత్రం లక్షల రూపాయల దందా నడుస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో నాయకులు, అధికారులకు వాటాలు, ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీపీసీలో బొగ్గును మండించిన తర్వాత బూడిద వస్తుంది. ప్రతి రోజూ దాదాపుగా 11 వేల టన్నుల బూడిద రామగుండం మండలం మల్యాలపల్లి చెరువులోకి వచ్చి చేరుతుంది. ఈ బూడిదను జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకల తయారీతోపాటు ఇతర నిర్మాణాలకు ఉచితంగా ఇవ్వడానికి ఎన్టీపీసీ నిర్ణయించింది. అందులో భాగంగా బూడిద రవాణాకు టెండర్లను పిలువగా.. గతేడాది 38 టన్ను ఉండేది. ఆ తర్వాత 138కు టన్ను చొప్పున తీసుకునేందుకు 38 మంది టెండర్లు దాఖలు చేసి టెండరు దక్కించుకున్నారు. ఒక్కొక్కరు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు డిపాజిట్ సైతం చేశారు.
వీరి నుంచి ఈఎండీ కట్టించి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నారు. వారు దాదాపుగా 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఖర్చు చేశారు. యాష్ పాండ్‌లో వాళ్లు రోడ్లు నిర్మించుకున్న తర్వాత స్థానికంగా కొందరు ఆటంకాలను కల్పించి బూడిద వెలికితీతను నిలిపివేయించారు. తర్వాత అధికారులు టెండర్లను రద్దు చేస్తామని ప్రకటించి హోల్డ్‌లో పెట్టారు. ఎన్టీపీసీ తిరిగి 1కే టన్నుగా టెండర్లను పిలువగా, 114మంది ఈ టెండర్లను దాఖలు చేసి దక్కించుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. కొందరు స్థానిక నాయకులు అందులోకి చొరబడి, లోడింగ్ దగ్గర తిరకాసు పెట్టినట్టు తెలిసింది.
వాస్తవంగా అయితే, లోడింగ్ ఎన్టీపీసీ అయినా చేయాలి లేదా టెండరు దక్కించుకున్నవాళ్లు ఎవరికి వారు జేసీబీలు పెట్టుకొని చేసుకోవాలి. కానీ, ఇక్కడ రాజకీయ జోక్యంతో ఓ ఐదుగురు వ్యక్తులు చక్రం తిప్పి ఐదు లోడింగ్ మిషన్ల (జేసీబీలు)కు మాత్రమే అనుమతులు తెచ్చుకున్నట్టు తెలిసింది. నిజానికి ఒక్కో లారీ లోడింగ్ చార్జి 700 నుంచి వెయ్యి వరకు అవుతుంది. కానీ, ఇక్కడే దందాకు తెర తీసి, భారీగా వసూళ్లకు దిగారనే విమర్శలున్నాయి. ఒక్కో లారీకి 4,600 నుంచి 9,600 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి రోజూ దాదాపు వెయ్యి వాహనాల్లో బూడిదను తరలిస్తుండగా, రోజుకు 30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో పెద్దలకూ వాటాలు వెళ్తున్నాయని, ఈ విషయంలో ఉన్నతాధికారులు సైతం మౌనం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అసలు ఎన్టీపీసీనే లోడింగ్ చేపడితే కేవలం వెయ్యికే అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్టీపీసీ బూడిద విషయంలో దళారులు పెద్ద ఎత్తున వసూళ్లకు దిగుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల పేరు చెప్పి దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. బసంత్‌నగర్-రామగుండం మధ్య ఉన్న మల్యాలపల్లి గేటు వద్ద బహిరంగంగా చెట్లల్లో టేబుల్ వేసుకొని ఒక కంపెనీ పేరిట 500 చొప్పున డబ్బులు కట్టించుకొని వే బిల్లులు ఇస్తున్నట్టు తెలిసింది. మరో రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఒక కంటైనర్ పెట్టుకొని, రాత్రయితే అదే కంటైనర్‌లో టేబుల్ కుర్చీలు వేసుకొని వసూలు చేయడం, పగలైతే అటవీ ప్రాంతంలో టేబుల్, కుర్చీలు వేసుకొని డబ్బులు బాజాప్తా వసూలు చేస్తున్నారనే సమాచారం అందుతున్నది.
బూడిదను లారీల్లో లోడ్ చేయాలంటే ఇక్కడ ఒక్కో లారీకి ఒక్కో ధరను నిర్ణయించారు. కేవలం వెయ్యిలోపే అయ్యే ఖర్చును 4,600 నుంచి 9,600 వరకు వసూలు చేస్తున్నారు. 12 టైర్ల వాహనంలో 22 టన్నులు నింపాలి. కానీ, ఇక్కడ 4600 వసూలు చేసి 25 నుంచి 27 టన్నులు నింపుతున్నారు. అలాగే, 14 టైర్ల వాహనంలో 32 టన్నులు నింపాల్సి ఉండగా, 6100 తీసుకొని 40 టన్నులు నింపుతున్నారు. 16 టైర్ల వాహనంలో 35 టన్నులు నింపాల్సి ఉండగా, 9600 వసూలు చేసి 47 టన్నులు లోడ్ చేస్తున్నారు.
అక్రమాలకు ఆస్కారం లేకుండా లోడింగ్ చేయాలి. ఎన్టీపీసీ లోడింగ్‌ను సైతం చేపట్టాలి. సాధారణంగా లోడింగ్‌కు 700 నుంచి 1200 లోపు అవుతుంది. అలా డబ్బులు తీసుకొని చేసినా ప్రయోజనమే. కానీ, ఇలా దళారులను మేపే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం వ్యవహరించడం అన్యాయం. లారీ ఓనర్లు, డ్రైవర్ల కడుపు కొడుతున్నారు. 4600 నుంచి 9600 వరకూ వసూళ్లు చేస్తున్నారు. ఓవర్‌లోడ్ లేకుండా రవాణాను సైతం స్థానిక లారీలకే అవకాశం ఇవ్వాలి. లైన్ బండ్లకు అవకాశం ఇవ్వడం వల్ల స్థానిక లారీ ఓనర్లు నష్టపోతున్నారు. అక్రమ వసూళ్లను అడ్డుకోవాలి. ఈ అవినీతిలో అందరికీ పాత్ర ఉంది. స్థానిక ప్రజాప్రతినిధి నుంచి మంత్రులకు సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
-కౌశిక్‌హరి, ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు రామగుండం