కరీంనగర్ ముకరంపుర, జనవరి 6: క్షేత్రస్థాయిలో ట్రాన్స్ ఫార్మర్స్ వైఫల్యాలను నియంత్రించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. కరీంనగర్ సరిల్ కార్యాలయ సమావేశం మందిరంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీటీఆర్ ఫెయిల్యూర్స్‌ను తగ్గించాలని, లైన్లను సక్రమంగా మెయింటనెన్స్ చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా చేయాలన్నారు.
ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతినకుండా మెయింటనెన్స్ చేస్తూ విద్యుత్‌ను ఆదా చేస్తూ వ్యవసాయానికి నిరంతర పవర్ అందించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు రెవెన్యూ వసూళ్లను రాబట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు విద్యుత్ రాయితీపై అవగాహన కల్పించాలని, మీటర్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, లోపాలను గుర్తించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని కరీంనగర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు, మెయింటనెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మెటీరియల్ సైప్లె విషయంలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఉండాలన్నారు. అనంతరం నేరుగా కరీంనగర్ రూరల్ ఈఆర్వో కార్యాలయాన్ని సందర్శించారు.
అలాగే ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి, పలు పోటీల్లో బహుమతులు సాధించిన విద్యుత్ శాఖ క్రీడాకారులను, కళాకారుడైన విద్యుత్ ఉద్యోగి మంచాల రమేశ్‌ను సీఎండీ అభినందించారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించి, అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డైరెక్టర్లు బీ వెంకటేశ్వరరావు, మోహన్ రెడ్డి, సంధ్యారాణి, గణపతి, సీజీఎంలు అశోక్ ప్రభాకర్, వేణుబాబు, ఎస్ఈ వడ్లకొండ గంగాధర్, డీఈలు విజయేందర్ రెడ్డి, చంద్రమౌళి, కాళిదాసు, లక్ష్మిరెడ్డి ఉన్నారు.