పెద్దపల్లి, నవంబర్ 15(నమస్తే తెలంగాణ)/ జగిత్యాల అర్బన్ : ‘రాష్ట్రంలోని మా లాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఎంబీబీఎస్ సీటు వచ్చిందంటే దానికి కారణం సీఎం కేసీఆరే. ఇది మాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్య విద్య చదువుతామని మేము కలలో కూడా అనుకోలేదు. మా కలల ఇప్పుడు వాస్తవ రూపంలో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయంటే అందుకు కారణం గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ట్రంలో ఈ ఏడు కొత్తగా 8మెడికల్ కళాశాలలను పెంచడం వల్లే ఈ రోజు సీట్లు పెరిగి ఎక్కువ మందికి ఎంబీబీఎస్ చదివే అదృష్టం కలిగింది. థాంక్యూ సీఎం సార్’ అంటూ రామగుండం మెడికల్ కళాశాల విద్యార్థులు తమ మనోగతాన్ని ఆవిష్కరించారు.
పెద్దపల్లి: కుటుంబసభ్యులతో కలిసి హాజరైన వైద్య విద్యార్థులు
ఇంటి దగ్గర ఉండే ఎంబీబీఎస్ చదవచ్చు
మాది ఇక్కడే గోదావరిఖనిలోని రమేశ్‌నగర్. మమ్మీడాడీ సపోర్ట్‌తో ఎంబీబీఎస్‌లో సీటు సాధించా. కౌన్సెలింగ్‌లో ఈ యేడాది నుంచే మా ఊరిలో ప్రారంభమైన ఈ రామగుండం మెడికల్ కళాశాలను పెట్టుకున్నా. సీటు వచ్చింది. ఇక ఇంటి దగ్గరి నుంచే ఎంబీబీఎస్ చదవచ్చు. సీఎం కేసీఆర్ వల్లే ఇక్కడ కాలేజీ ఏర్పాటైంది. చాలా హ్యాపీ.
– దాసరి హర్షిక, ఎంబీబీఎస్ స్టూడెంట్ (రామగుండం మెడికల్ కాలేజీ)
కలలో కూడా అనుకోలేదు
మాది గోదావరిఖని విఠల్‌నగర్. డాడీ గోల్డ్ స్మిత్. నేను ఇక్కడే ఇంటర్ వరకు చదువుకున్నా. ఎంబీబీఎస్ చేయాలనుకున్నా. ఆ కల సీఎం కేసీఆర్ సహకారంతో నిజమైంది. నేను గోదావరిఖనిలో ఎంబీబీఎస్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. రామగుండానికి కూడా మెడికల్ కళాశాల వస్తుందని ఏనాడూ అనుకోలేదు.
– ఏలేశ్వరం హరీశ్, ఎంబీబీఎస్ స్టూడెంట్
(రామగుండం మెడికల్ కాలేజీ)
చాలా ఎైక్జెట్మెంట్గా ఉన్నది
నాది జమ్మూకశ్మీర్. నీట్ ర్యాంకు ఆధారంగా జగిత్యాల గౌట్ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. కొత్త కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరడం చాలా ఎైగ్జెట్ట్మెంట్గా ఉంది. కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ మాదే కావడం చాలా హ్యాపీ. సీనియర్లు ఎవరూ లేకపోవడంతో ర్యాగింగ్‌కు అవకాశం ఉండదు. ఇది మాలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది.
– స్నోబర్ జాన్, ఎంబీబీఎస్ స్టూడెంట్
(జగిత్యాల మెడికల్ కాలేజీ)
ఇది సీఎం సార్ విజన్‌కు నిదర్శనం
మాది మంథని మండలం పుట్టపాక. డాడీ అగ్రికల్చర్ చేస్తాడు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్లే ఎక్కువ మందికి ఎంబీబీఎస్ చదివే అవకాశం వచ్చింది. కాలేజీలు పెరగడంతో సీట్లు పెరిగాయి. ఇది సీఎం సార్ విజన్‌కు నిదర్శనం. నేను ఇక్కడే గోదావరిఖనిలో ఎంబీబీఎస్ చేస్తా అని ఎన్నడూ అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉన్నది.
– చాట్లపల్లి నవ్య, ఎంబీబీఎస్ స్టూడెంట్
(రామగుండం మెడికల్ కాలేజీ)
ఫుల్ హ్యాపీ.. సీఎంకు థ్యాంక్స్
మాది రామగిరి మండలం సెంటినరీకాలనీ. పెద్దపల్లి జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం మనందరి అదృష్టం. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల కంటే రామగుండం మెడికల్ కళాశాలనే నంబర్-1 అవుతుంది. ఇక్కడ భోధన, వసతి సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ ప్రభుత్వంతోపాటు సింగరేణి నిధులు కూడా వెచ్చించి చాలా ఫెసలిటీస్ కల్పించారు. మా ఏరియాలోనే మేం ఎంబీబీఎస్ చదివే అవకాశం రావడం అరుదు. ఇప్పుడు నాకు వచ్చింది. ఫుల్ హ్యాపీ. సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్.
– కోల శ్రీజశివాని, ఎంబీబీఎస్ స్టూడెంట్
(రామగుండం మెడికల్ కాలేజీ)
పుట్టిన ఊరిలోనే చదువుకోవచ్చు
మాది జగిత్యాల టౌన్. నేనే ఇక్కడే చదువుకున్న. మెడిసిన్ చేయాలని అనుకున్నా. ఎంబీబీఎస్ కోసం ఎక్కడికో పంపించేందుకు పేరేంట్స్ కాస్త భయపడ్డారు. సీఎం కేసీఆర్ కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించడం, అందులో జగిత్యాలలో కూడా ఉండడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. మంచి ర్యాంక్ రావడంతో జగిత్యాల మెడికల్ కాలేజీలోనే అడ్మిషన్ తీసుకున్నా. పుట్టి పెరిగిన ఊర్లోనే సీటు రావడం నాకు చాలా లక్కీ. పేరెంట్స్‌తో ఉంటూనే ఎంబీబీఎస్ చేసే అవకాశం రావడం నిజంగా హ్యాపీ.
– సుష్మ, ఎంబీబీఎస్ స్టూడెంట్ (జగిత్యాల మెడికల్ కాలేజీ)
మాదే ఫస్ట్ బ్యాచ్
మాది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట. అందుకు దగ్గరవుతుందని జగిత్యాల మెడికల్ కాలేజీ అడ్మిషన్ తీసుకున్న. మాదే ఫస్ట్ బ్యాచ్. సీనియర్లు ఉండరు. ర్యాగింగ్ కూడా ఉండదు. చాలా హ్యాపీగా ఉన్నది. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సీట్ వచ్చింది. ప్రభుత్వ కాలేజీ కావడంతో ఫీజుల భారం కూడా తప్పుతుంది. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తా.
– కే నిఖిల్, ఎంబీబీఎస్ స్టూడెంట్
(జగిత్యాల మెడికల్ కాలేజీ)
అన్ని వర్గాల స్టూడెంట్స్‌కు యూజ్‌ఫుల్
మాది జమ్మికుంట. గవుట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు రావడం చాలా హ్యాపీగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించడంతో మాలాంటి వారికి అవకాశం దక్కింది. అన్ని వర్గాల స్టూడెంట్స్‌కు ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంది. తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ పూర్తి చేసే చాన్స్ ప్రభుత్వం కల్పించింది. పేద విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వరంలా మారాయి.
– ఈ అఖిల్, ఎంబీబీఎస్ స్టూడెంట్
(జగిత్యాల మెడికల్ కాలేజీ)