Endowments Department | వేములవాడ, జూన్ 6 : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీల పై నిషేధాన్ని విధించినట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే రాష్ట్ర దేవాదాయ శాఖలో మాత్రం అంత్యపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాలు ముగిసిన తర్వాత ఉద్యోగ బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరగా అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర దేవాదాయ శాఖ దేవాలయాల్లో ఉద్యోగుల బదిలీలపై జీవో నెంబర్ 38తో కూడిన మెమోను అధికారులు జారీ చేశారు.
ఇక బదిలీల వంతు దేవాదాయ శాఖ ఉద్యోగులది కాగా మార్గదర్శకాలు బదిలీల వ్యవహారం పై ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు మాసంలో రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరి గుట్ట, కొండగట్టు, కొమరవెల్లి, బాసర, భద్రాద్రి ఆలయాలను ఆరు దేవాలయాలను యూనిట్ గా చేసి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో విడత గా మరోసారి బదిలీలకు తెరలేపగా దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
మార్గదర్శకాలపై ఉద్యోగుల్లో ఆందోళన…!
రాష్ట్రవ్యాప్త దేవాలయ ఉద్యోగుల బదిలీలు జరగనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయనుందోనని ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. మొదటి విడతలో జరిగిన ఉద్యోగ బదిలీలో ఉద్యోగ నియామకమైన నాటి నుండి సీనియారిటీని పరిగణంలోకి తీసుకొనడమే కాకుండా మొత్తం ఉద్యోగుల్లో 40శాతం మంది ఉద్యోగులకు మాత్రమే బదిలీ చేసింది. అయితే ఉద్యోగులను ముందుగా ఆప్షన్లు అడిగినప్పటికీ తదుపరి జరిగిన ప్రక్రియలో దేవాదాయశాఖ బదిలీ చేసిన తుని నిర్ణయం అధికారులే తీసుకొని బదిలీ చేశారు. ఈనెల 21లోపు బదిలీ ప్రక్రియ పూర్తికానుండగా రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రధానంగా బాసర, భద్రాద్రి ఆలయాలకు మాత్రం వెళ్లేందుకు ఉద్యోగులు విముఖత చూపుతున్నారు.
మొదటి విడత బదిలీలో పైరవీకి పెద్దపీట…!
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఉద్యోగులకు 2024 ఆగస్టు మాసంలో బదిలీలు జరిపారు. ఆరు ఆలయాలను యూనిట్ గా చేసుకొని బదిలీలు జరపగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులు బదిలీ కాగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. అయితే ఇందులో బదిలీ ప్రక్రియ పూర్తయి విధుల్లో చేరిన తర్వాత ఉద్యోగులు తమ మాతృ సంస్థకు వెళ్లేందుకు చేసిన పైరవీలకు అధికారులు పెద్దపీట వేశారు. ఇక వేములవాడ రాజన్న ఆలయానికి బదిలీపై వచ్చిన ఏఈఓ రమేష్ బాబు, పర్యవేక్షకులు శ్రీలత, రాజన్ బాబు, వెంకట ప్రసాద్, సంజీవరావు లను వర్క్ ఆర్డర్, ఇతర పేరులతో బదిలీ చేశారు. ఇక బాసర ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓ లక్ష్మణ్ రావు వేములవాడకు, కొమరవెల్లి లో పనిచేస్తున్న సురేందర్ రెడ్డి యాదగిరిగుట్టకు, బాసరలో విధులు నిర్వహిస్తున్న రామారావును భద్రాచలం కు కూడా బదిలీ చేశారు. గతంలో బదిలీ జరిగిన నెల రోజులు కూడా గడవకముందే వీరి బదిలీ అధికారులు పైరవీలకు పెద్దపేట వేయడమే ఇందుకు నిదర్శనం.