Co-option Elections | కోల్ సిటీ, ఏప్రిల్ 16 : పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ లో కో -ఆప్షన్ పదవుల భర్తీకి గురువారం సాయంత్రం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. జీవో నంబర్ 57, 58 అనుసరించి సీడీఎంఏ ఉత్తర్వుల ప్రకారం.. ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు గురువారం ఈనెల 23 వరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఐదుగురు సభ్యుల ఎన్నిక విధానం, అర్హతలను ఆ నోటిఫికేషన్ లో పొందుపరిచారు. ఐదుగురు కో-ఆప్షన్ సభ్యుల్లో పాత పద్ధతి మాదిరిగానే ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉండనున్నారు. వీరిలో ఇద్దరు మైనార్టీ కి చెందిన వారు కాగా ముగ్గురు జనరల్ కేటగిరి నుంచి ఎన్నుకుంటారు. రామగుండం మున్సిపాలిటీకి మూడు సంవత్సరాల పాటు న్యాయ సేవలు అందించిన న్యాయవాది గాని, మాజీ కార్పొరేటర్ లు గాని, రామగుండం కార్పొరేషన్ లో పరిపాలన విభాగం పైన ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు గాని పోటీ చేయడానికి అర్హులుగా ప్రకటించారు.
దీంతో రామగుండం కార్పొరేషన్ లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా కో ఆప్షన్ పదవులపై 30 నుంచి 50 మంది వరకు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఐదుగురిని మాత్రమే పదవులకు ఎంపిక చేయనున్నారు. మిగతా వారి పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రామగుండంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.