తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరెక్కడా జరుగడం లేదని, అందుకు నిదర్శనం వెలిచాల గ్రామమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వెలిచాలను అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామడుగు మండలం వెలిచాలలో కోటీ 21లక్షలతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, ఒక వంతెనను మరో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం దేశాన్ని నాశనం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఒక్క పైసా తేని ఎంపీ బండి సంజయ్ తుపాకీ వెంకట్రాముడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి మేరకు చొప్పదండి నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 25 కోట్లు, వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన విజ్ఞప్తి మేరకు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మరో 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు.
కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/రామడుగు : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, తెలంగాణలాంటి అభివృద్ధి దేశంలో మరెక్కడా జరుగడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం వెలిచాల గ్రామమని నిదర్శనమని, మిగతా పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని ఆదర్శంగా నిలిపిన సర్పంచ్ వీర్ల సరోజనను అభినందించారు. రామడుగు మండలం వెలిచాలలో రూ.కోటీ 21 లక్షలతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, ఒక వంతెనను మరో మం త్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామం లో నిర్వహించిన సభలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పెన్షన్ విధానం, పీడీఎఫ్ బియ్యం విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌తోపాటు ఇప్పుడు తెలంగాణలో వినూత్న పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మాత్రమే తనకు నచ్చిన నాయకులని స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఇస్తున్నట్లు ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ పాలిత కర్ణాటకలో 500, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో 600 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, పెన్షన్ కోసం ఆయా రాష్ర్టాల్లో అనేక ఆంక్షలు విధిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో దివ్యాంగులకు 3,016, ఇతర వర్గాలకు 2,016 ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వెలిచాలలో ఇక్కడ 780 మందికి ఆసరా పెన్షన్ల కింద నెలకు 16.90 లక్షలు అందిస్తున్నామన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు ప్రతి గ్రామంలో రెండు మూడు మోటర్ వైండింగ్ వర్క్‌షాపులు ఉండేవని, కేసీఆర్ ఇస్తున్న 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ కారణంగా ఇప్పుడు చూద్దామన్నా ఒక్క వైండింగ్ షాపు కనిపించడం లేదన్నారు. రైతులకు సీఎం కేసీఆర్ నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నదని, ఇలా చేస్తే ఒక్కో రైతు ఏడాదికి రూ. లక్ష బిల్లు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. అందుకే తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టనీయనని కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు ఎస్సారెస్పీలో నీళ్లు ఉండేవి కాదని, గతంలో మా వరంగల్‌కు నీళ్లు ఎప్పుడు ఇస్తారని కరీంనగర్లో ఉన్న నాయకులకు ఫోన్లు చేసి అడిగే వాళ్లమని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇపుడు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని, ఇపుడు నీళ్లు బంజెయ్యమని ఫోన్లు చేయాల్సి వస్తున్నదని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 2 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10 వేలు ఇస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఒక్క వెలిచాల గ్రామంలోనే 1,478 మంది రైతులకు ఇప్పటివరకు రైతుబంధు కింద 9 కోట్లు వచ్చాయని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ వస్తుంటే బీజేపీ నాయకులు దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నరని, వాళ్లు పెద్ద దొంగలని మండి పడ్డారు. వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ అనేక రోడ్లు మార్గాలు, రైల్వే మార్గాలు శాంక్షన్ చేయించారని గుర్తు చేశారు. అయినా బండి సంజయ్‌కు పొరపాటుగా గుండు ఓట్లు వేస్తిరని, ఇప్పటి వరకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కపైసా తేకుం డా లేనిపోని రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన మాటలు విం టుంటే ఎన్కటికి తుపాకి వెంకట్రాముడు గుర్తుకు వస్తున్నాడని, ఆయన బండి సంజయా.. గుండు సంజయా.. అని ఎద్దేవా చేశారు.
సంజయ్ పాదయాత్ర చేయాల్సింది అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో కాదని, దమ్ముంటే కర్ణాటక, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో చేసి అభివృద్ధిని పరిశీలించాలని హితవు పలికారు. ఒక పక్క కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం దేశాన్ని నాశనం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 25 కోట్లు, వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన విజ్ఞప్తి మేరకు ఆ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మరో రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.