చలి తీవ్రమవుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా భయపెడుతున్నది. డిసెంబర్, జనవరిలో నమోదయ్యే రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే నమోదవుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 14 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు కమ్ముకుంటున్నది. వారం నుంచి పొద్దంతా చలి తీవ్రత ఒకేలా ఉంటుండగా, ప్రజానీకం ఇబ్బంది పడుతున్నది.
కరీంనగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : చలి విపరీతంగా పెరుగుతున్నది. గతేడాది కంటే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. గతేడాది ఇదే నెలలో రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 21 డిగ్రీలు నమోదయ్యాయి. కానీ, ఈ యేడాది మాత్రం 18 నుంచి 14 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో డిసెంబర్, జనవరిలో కనిపించేది. ప్రస్తుతం నెల ముందుగానే తీవ్రత పెరిగింది. ఉత్తరాది రాష్ర్టాల నుంచి వీస్తున్న చలి గాలుల తీవ్రత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామీణ ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకుంటున్నది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పొగమంచు కనిపిస్తున్నది. ఈ నెల 15 వరకు రాత్రి వేళ 20 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనా, 16న ఒక్కసారిగా 18 డిగ్రీలకు పడిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్థితిలో నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 28కి పడిపోయాయి. అంతే కాకుండా గాలిలో తేమ శాతం 37కు పెరిగింది. దీనికితోడు గంటకు 7 కిలోమీటర్ల చొప్పున చలి గాలులు వీస్తుండగా, చలి తీవ్రత కనిపిస్తున్నది.
చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమ్మకాలు సాగుతున్నాయి. అస్సాం, నేపాల్, మిజోరాం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులకు ఈ సారి పంట పండుతున్నది. దుప్పట్లు, జర్సీలు ఎక్కడ పడితే అక్కడ విక్రయిస్తున్నారు. ఉన్ని దుస్తులకు అమాంతం ధరలు పెంచినా కొనక తప్పడం లేదని జనం వాపోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్, అమరుల స్తూపం వద్ద, జ్యోతినగర్, శాతవాహన యూనివర్సిటీ రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ ఏరియాల్లో ఏర్పాటు చేసిన ఉన్ని మార్కెట్లో జనం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. పిల్లలకు, తమకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసుకుంటున్నారు. హైవేల వెంట, నగర శివార్లులో కూడా ఈ సారి ఉన్ని దుస్తులు అమ్ముతున్నారు.
సాధారణంగా చలికాలంలో గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయి. ఎక్కువగా గుండెపోట్లు కనిపిస్తుంటాయి. ఈ సీజన్లో చాలా మంది పని తగ్గించడం వలన స్ట్రోక్, హార్ట్ ఫెల్యూర్, కార్డియోవాస్క్యులర్ ఇబ్బందులు, ఎరిథిమిమో వంటి సమస్యలు వస్తున్నాయని వైద్యలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెను సంరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. చలికాలం శరీరాన్ని సాధ్యమైనంత వరకు వేడిగా ఉంచుకోవాలని, గుండెను పదిలంగా ఉండేందుకు ఇది మంచి పద్ధతని, ఫిజికల్ ఆక్టివిటీస్ ఎక్కువగా ఉంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని, దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుందని చెబుతున్నారు. చలికాలం జాగ్రత్తగా ఉండాలని, అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని, గుండె పరీక్షలు చేయించుకోవాలని, గుండె సంబంధిత వ్యాధులున్న వారు చలికి తిరగవద్దని సూచిస్తున్నారు.
చలి ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపుతుంది. వీరు దగ్గు, శ్వాస కోశ వ్యాధుల బారిన పడే ముప్పు ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. చలిలో తిరగవద్దు. ఉన్ని దుస్తులు ధరించాలి. కాచి వడబోసిన నీళ్లు తాగాలి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు దుమ్ము, ధూళి ప్రాంతాల్లో తిరగకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలని. చలి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి సీజనల్, ఇతర వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నందున విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారాన్ని భోజనంలో ప్రతి రోజు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మాంసాహారాన్ని కాకుండా పండ్లు, కూరగాయలు, దుంపలు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుందని సూచిస్తున్నారు.