కరీంనగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగియగా.. తాజాగా, ఒకేసారి 20 మందిని ట్రాన్స్ఫర్ చేసింది. అందులో ఉమ్మడి జిల్లాలోని నలుగురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని బదిలీ చేయగా.. ఆమె స్థానంలో సిరిసిల్ల నుంచి అనురాగ్ జయంతిని నియమించారు. కాగా, ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆయన గతంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్ జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పనిచేశారు. జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా కూడా బదిలీ కాగా, ఆమె స్థానంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా పని చేస్తున్న బుడుమజ్జి సత్యప్రసాద్‌ను నియమించారు. పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌ను ఖమ్మంకు ట్రాన్స్ఫర్ చేయగా, ఆయన స్థానంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జగిత్యాల కలెక్టర్‌గా ఉన్న షేక్ యాస్మిన్ బాషాను సీఎస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుతం బదిలీ అయిన నాలుగు జిల్లాల కలెక్టర్లు పాలనలో తమదైన ముద్ర వేసుకున్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ పథకాలను విజయవంతంగా అమ లు చేయడమే కాదు, ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను చాటారు. గతేడాది మే, జూన్‌లో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అత్య ంత వైభవంగా నిర్వహించి ప్రభుత్వ, ప్రజల మన్ననలు పొందారు. అలాగే 2023 నవంబర్‌లో అసెంబ్లీ, ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. అత్యంత సాఫీగా నిర్వహించడంలో కృతకృత్యులయ్యారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా బుడుమజ్జి సత్యప్రసాద్ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన ఆయన, 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. గతేడాది సెప్టెంబర్ 9 నుంచి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతి కల్పిస్తూ జగిత్యాల కలెక్టర్ నియమించారు. ఆయన ఎక్కడ పనిచేసినా తన ప్రత్యేకతను చాటారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ పంచాయతీల పాలనను సమర్థవంతంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిన ఈ తొమ్మిదేండ్లలో కలెక్టర్‌గా నియమితులైన వారిలో అతి పిన్న వయస్కుడిగా కోయ శ్రీహర్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఖమ్మం జిల్లా జయనగర్ కాలనీకి చెందిన శ్రీహర్ష 2017యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 6వ ర్యాంకర్‌గా నిలిచారు. 2018లో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకొని, తొలుత 2020-2022వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. 2022 అక్టోబర్ 9నుంచి ఇప్పటి వరకు నారాయణపేట కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. సౌమ్యుడిగా, వర్క్ మైండెడ్‌గా ఆయన గుర్తింపు పొందారు. శ్రీహర్ష తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే కాగా, భార్య, బాబు ఉన్నారు.