అధికారులకు ముడుపుల పేరుతో మిల్లర్స్ యాజమాన్యాల నుంచి అసోసియేషన్లు వసూలు చేస్తున్న డబ్బుల్లో భారీగా గోల్మాల్ జరుగుతుందా? సంబంధిత అధికారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రూ.లక్షల్లో లెక్కలు చూపుతున్నాయా? మేం చెప్పింది వేదం.. మమ్మల్ని లెక్కఅడిగే దమ్ము ఎవరికి ఉంది? అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయా? నిజాయితీ అధికారులకు సైతం ముడుపుల మచ్చను అంటగడుతున్నాయా? అంటే తాజా, పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ల నుంచి అధికారులకు భారీ ముడుపులు?, మిల్లర్ల గొడవతో బయటకు వస్తున్న బాగోతం పేరుతో ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చాలామంది అధికారులు మిల్లర్స్ అసోసియేషన్లలో జరుగుతున్న గుట్టు విప్పారు. అంతేకాదు.. లెక్కల్లో రాసిన పేర్లను తీసుకొని వస్తే.. ఏది నిజమో ఏది అబద్ధమో తేలుతుందని సదరు అధికారులు ఘంటా పథంగా చెప్పడం చూస్తే.. మిల్లర్స్‌కు అండగా నిలవాల్సిన అసోసియేషన్లు.. మసిబూసి మారేడుగాయ చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజానికి మిల్లర్స్ అసోసియేషన్లకు ఒక చరిత్ర ఉంది. అసోసియేషన్ పరిధిలోని ఏ మిల్లర్‌కు కష్టమొచ్చినా వారికి అండగా నిలవాలి. అవసరమైతే అధికారులతో మాట్లాడాలి. ఇదే సమయంలో నిబంధనలకు లోబడి మిల్లులను నడిపేలా చూడాలి. దీంతోపాటు అక్రమ పద్ధతుల్లో వెళ్లే మిల్లర్ల వ్యవహారాన్ని ఈసీ ముందు పెట్టడంతోపాటు, జనరల్‌బాడీ మీటింగ్‌లో పెట్టి చర్చించాలి. మొత్తంగా అసోసియేషన్లు తమ స్వార్థం కోసం కాకుండా.. రైస్ ఇండస్ట్రీ బాగోగుల కోసం పోరాడాలి. అసోసియేషన్ బైలా ఇదే సూచిస్తున్నది.
అంతే కాదు.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు రూ.5 వేలకు మించి ఖర్చు చేయాల్సి వస్తే.. ఈసీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి అనేక అంశాలకు పలు అసోసియేషన్లు తూట్లు పొడుస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని రెండు జిల్లాల్లో మాత్రం అసోసియేషన్లు పూర్తిగా అడ్డదారుల్లో వెళ్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నిజాయితీగా, నిబంధనలకు లోబడి నడుచుకునే మిల్లర్లను కాదని.. అడ్డదారుల్లో వెళ్లే వారికి అసోసియేషన్లు అందలం వేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ధాన్యం, ర్యాకులు, బెడ్ల కేటాయింపుల్లోనూ వారికే ముందు ప్రాధాన్యం ఇవ్వడానికి కొన్ని అసోసియేషన్లు తహతహలాడుతున్నాయి. దీని వెనుక పెద్ద తతం గం జరుగుతుందన్న చర్చ ప్రస్తుతం మిల్లర్స్‌లో నడుస్తోంది. అంతేకాదు.. అడ్డదారుల్లో నడుస్తున్న కొంత మంది వల్ల రైస్ ఇండస్ట్రీ వ్యవస్థకు చెడ్డ పేరు రావడమే కాకుండా.. నిజాయితీగా మెదలిన మిల్లర్స్‌ను కూడా ప్రజలు అదే కోణంలో చూస్తున్నారన్న అందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రతి అసోసియేషన్ బైలా ప్రకారం నడుచుకోవడంతోపాటు.. నిబంధనలకు లోబడి నడిచే మిల్లర్లకు అండగా నిలువాల్సిన అవసరం ఉంద న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ గోల్మాల్?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు జిల్లాల్లో అసోసియేషన్స్ తప్పుడు పద్ధతుల్లో వెళ్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారుల పేరుతో మిల్లర్స్ నుంచి వసూలు చేస్తున్న డబ్బుల్లో భారీ గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నుంచి అధికారులకు భారీ ముడుపులు?.. మిల్లర్ల గొడవతో బయటకు వస్తున్న బాగోతం..’ పేరుతో ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం అధికారుల్లో సంచలనం సృష్టించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే వారిని కదిలించింది. అంతేకాదు.. మిల్లర్స్ అసోసియేషన్స్ నుంచి ఏ అధికారికి ఎంత ముడుపులు ముట్టినట్లుగా లెక్కలు చూపారన్న విషయాన్ని ఎండగట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖతో సంబంధం ఉన్న కొంత మంది అధికారులు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి వాస్తవాలను వివరించారు. రూ.లక్షల్లో డబ్బులు ఇచ్చినట్లుగా అసోసియేషన్ వాళ్లు లెక్కలు రాసుకోవడం తప్ప.. ఆచరణలో పూర్తి అబద్ధమన్నారు. ఏదేని సందర్భంగా ఒక వేళ ఏమైనా సహాయం చేయమని అడిగినా.. ఇప్పుడు మిల్లర్స్ అసోసియేషన్ వసూలు చేయడం లేదంటూ తమనే బెదిరిస్తున్నారంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం ముగ్గురు అధికారుల పేరుతో ఒకరికి రూ.15 లక్షలు, మరో ఇద్దరికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చినట్లు అసోసియేషన్ లెక్కలు చూపినట్లుగా తమకు సమాచారం ఉందని, ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తతో లెక్కలు నిజమనే విషయం అర్థమైందన్నారు. కాబట్టి.. ఈ లెక్కలు తేలాలంటే.. ఒక్కటే పరిష్కారం ఉందంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. రూ.లక్షల్లో ముడుపులు ఇచ్చినట్లు చెపుతున్న వ్యక్తులతోపాటు ఆయా అసోసియేషన్ల ఈసీ సభ్యులను తీసుకొని.. సదరు అధికారుల వద్దకు వస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఎవరి స్వార్థం కోసం వారు.. లెక్కలు రాసుకొని.. తమను బలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరో అధికారి వాపోయారు.
అధికారులకు ముడుపుల పేరుతో వసూలు చేయడం.. లెక్కల్లో ఇచ్చినట్లుగా రాయడం.. అవి ఎవరి ప్రయోజనాలకో వాడుకోవడం.. ఆ బదనాంను అధికారులపై రుద్దడం వంటి అంశాలు రెండు జిల్లాల్లో జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చాయని మరో అధికారి పేర్కొన్నారు. అయితే.. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. సదరు అధికారులపై చర్యలు తీసుకుంటే ఫరవాలేదు కానీ.. నిబంధనలకు లోబడి పనిచేసిన అధికారులకు రూ.లక్షలు ఇచ్చినట్లు అసోసియేషన్‌లో లెక్కలు రాసి.. ప్రతి మిల్లర్ ముందు తమను దోషులగా చిత్రీకరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని సదరు అధికారులు వ్యక్తం చేశారు.
ఇలాంటివి జరకుండా ఉండాలంటే.. ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజానికి అధికారులు చెప్పిన విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. అసోసియేషన్లు వివిధ కారణాలు చూపుతూ వసూళ్లకు పాల్పడి.. వాటిని సొమ్ముచేసుకుంటున్నారన్న విషయం స్పష్టమవుతున్నది. ఇదే సమయంలో.. ఎవరైనా అధికారుల్లో అక్రమార్కులుంటే.. మిల్లర్స్‌తో కలిపి అసోసియేషన్లు సదరు అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలే తప్ప.. మిల్లర్ల నుంచి వసూలు చేసి.. రూ.లక్షల్లో లంచాలు ఇచ్చినట్లుగా చూపడం భవిష్యత్‌కు మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మామూళ్ల వ్యవహారంపైనా మిల్లర్స్‌లో భారీ చర్చ నడుస్తోంది. అధికారుల పేరుతో వసూలు చేసింది ఎంత? వాళ్లకు ఇచ్చింది ఎంత? లెక్కలు చూపుతున్నది ఎంత? అన్న అంశాలపై ప్రధాన చర్చ జరుగుతోంది. తాజా, పరిస్థితుల నేపథ్యంలో అసోసియేషన్లు అడ్డదారులు మాని.. మిల్లర్లకు అండగా నిలిచి రైస్ ఇండస్ట్రీని కాపాడుకునే అంశంపై దృష్టిపెడితే వ్యక్తికి కాదు.. యావత్తు వ్యవస్థకు మేలు చేకూరుతుందన్న అభిప్రాయాలు మిల్స్ యజమానుల్లో వ్యక్తమవుతున్నాయి.