సహకార రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) సర్కారు విధానాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంలా మారుతున్నది. మరోవైపు సెస్ నష్టాల్లో ఉందంటూ ఈఆర్సీ పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సెస్.. రూ.కోట్లలో బకాయిలు పడ్డ సర్కారు ఆఫీసులకు షాక్ నిచ్చింది. బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చినా స్పందించని పలు కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపేసింది.
రాజన్న సిరిసిల్ల, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ఏకైక సహకార విద్యుత్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, నివాసాలకు అడిగిన వెం టనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వెలుగులు నింపుతున్న సెస్‌ను చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు భారమైపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల కోట్లలో బకాయిలు చెల్లించడం లేదని, దీంతో సెస్ సంస్థ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఏర్పడిందంటూ విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలోని పరిశ్రమలు, వ్యవసాయరంగం, గ్రామ పంచాయతీలు, సర్కారు కార్యాలయాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నది. సంస్థకు జిల్లా వ్యాప్తంగా 2.99 లక్షల మంది వినియోగదారులున్నారు. వినియోగదారుల వాటాధనంతో నడుస్తున్న ‘సెస్’.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నది. జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు దాదాపు 80 వేల వరకు ఉంటాయి. అందులో రెండోది మరమగ్గాల పరిశ్రమ. తర్వాత రైస్‌మిల్లులు, వివిధ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తున్నది.
అందులో వినియోగదారులు, వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాయాలు మొత్తం కలిపి ఇప్పటి వరకు సెస్ సంస్థకు 161.91కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. మరమగ్గాలకు రావాల్సిన సబ్సిడీ 36.92 కోట్లు, వ్యవసాయరంగం 16.40 కోట్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు 36.22 కోట్లు, బడులు, దేవాలయాలు 57 కోట్ల బకాయిలున్నాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 140 కోట్లు రావాల్సి ఉంది. జీపీలు, మున్సిపాలిటీల బకాయిలు పేరుకు పోయాయి. జిల్లాకు తలమానికం, వ్యాపార రంగంలో అగ్రగామిగా ఖ్యాతి గడించిన వస్త్ర పరిశ్రమలో 40 వేల మరమగ్గాలున్నాయి.
వీటిని అనుబంధ పరిశ్రమలు వార్పిన్, డైయింగ్‌లు, సైజింగ్ పరిశ్రమలున్నాయి. వీటికి ప్రభుత్వం 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నది. వాటి నిధులు కూడా విడుదల చేయడం లేదు. కాగా, అక్టోబర్‌లో సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన విద్యుత్ బిల్లుల పెంపు విషయమై బహిరంగ విచారణ నిర్వహించింది. మరమగ్గాలకు ఇస్తున్న 10 హెచ్‌పీల విద్యుత్ సబ్సిడీని 25కి పెంచాలని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. 10 నుంచి 25 హెచ్పీలకు సబ్సిడీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీచేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సబ్సిడీ పైసలు సెస్‌కు విడుదల చేయలేదు. దీంతో పెండింగ్ బకాయిలతోపాటు కొత్త బకాయిలు భారమయ్యాయి. నిధులు విడుదల చేసి మరమగ్గాల పరిశ్రమకు చేయూతనివ్వాలని వస్త్ర వ్యాపారులు కోరుతున్నారు.
నెలల తరబడి కరెంట్ బిల్లులు చెల్లించని కార్యాలయాలపై సెస్ చర్యలు తీసుకుంటున్నది. శుక్రవారం పలు కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపి వేసింది. బిల్లు లు చెల్లించాలంటూ జీపీలు, మున్సిపాలిటీలు, తహసీల్, పొదుపు సంఘాల కార్యాలయాలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులకు స్పందించక పోవడంతో కరెంటు కట్ చేసిం ది. సిరిసిల్ల మున్సిపాలిటీ 4 కోట్ల 58లక్షల 91వేలు, తహసీల్ ఆఫీస్ 1.76 కోట్లు, ఫారెస్టు ఆఫీస్ 5.47 కోట్లు, పొదుపు భవన్ 7.42కోట్లు, ఆర్అండ్బీ శాఖ భవనం 5కోట్ల 49 లక్షలు, ఆర్డీవో కార్యాలయం 4.44కోట్లు, జడ్పీ కార్యాలయం 1.71కోట్లు బకాయిలున్నట్టు సెస్ అధికారులు తెలిపారు. మున్సిపల్, ఎమ్మా ర్వో, పొదుపు భవన్, ఫారెస్టు కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపి వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు లేక పోవడంతో తహసీల్, మున్సిపల్ కా ర్యాలయాల్లో ఆన్లైన్ సేవలు నిలిచి పోయాయి. ప్రభు త్వం ఇప్పటి కైనా విద్యుత్ బిల్లులు విడుదల చేసి సెస్ సం స్థ అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతున్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 17 : సిరిసిల్ల మున్సిపల్‌కు సెస్ అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 4 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉండడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సెస్ ఎండీ విజయేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ లావణ్య సెస్ సంస్థ అధికారులతో మాట్లాడి విద్యుత్ బిల్లుల చెల్లిస్తామని తెలుపడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు చెప్పారు.