Jagtial | జగిత్యాల మే 15 : వృద్ధ తల్లి దండ్రుల పోషణ విస్మరించి, వేధింపులకు గురిచేస్తే వారి కుమారులు, కోడళ్లు, కూతుర్లు, వారసులకు జైలు శిక్ష తప్పదని, తల్లి దండ్రుల నుంచి కొడుకులు, కూతుర్లు పొందిన ఆస్తులను తిరిగి వారి తల్లి దండ్రుల పేరిట పట్టా మార్పిడీ జరుగుతుందని జగిత్యాల డివిజన్ వయోవృద్ధుల సంరక్షణ ట్రిబ్యునల్ అధికారి ఆర్డీవో పీ మధు సూదన్ హెచ్చరించారు. వయో వృద్ధుల సంరక్షణ చట్టం కింద వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆర్డీవో మధుసూదన్ రాయికల్ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన ఏనుగు లింగారావు, సారంగపూర్ మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన గడుప బక్కవ్వ, జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మతులాపురం రాజం అనే వృద్ధుల కేసుల్లో కొడుకులు, కూతుర్లు, కోడళ్ళను, అల్లుళ్లను, వారసులను శనివారం విచారించారు.
సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వృద్ధ తల్లిదండ్రుల పక్షాన వాదనలు వినిపిస్తూ న్యాయం చేయాలని కోరారు. విచారణకు హాజరు కాని వారికి సైతం చట్ట పరమైన చర్యలకు ఆర్డీవో నోటీసులు జారీచేశారు. ఈ కార్యక్రమంలో కాన్సిలియేషన్ అధికారులు పీసీ హన్మంత్ రెడ్డి, వెల్ముల ప్రకాష్ రావు, వృద్ధుల చట్టం సీనియర్ సహాయకురాలు పద్మజ పాల్గొన్నారు.