MLC L Ramana | చిగురుమామిడి, జులై 10 : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) లో బీఆర్ఎస్ ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బీఎల్ఏలతో మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణ హాజరై మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వార్డులలో జరుగుతున్న సర్ ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించాలన్నారు. ఓటర్లకు బీఎల్ఓ లు అందించిన ఎన్యుమరేషన్ ఫామ్ లో పూర్తి వివరాలు పొందుపరిచి తిరిగి ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈఎఫ్ లు ఎలా నింపాలో ఇప్పటికీ తెలియని గ్రామాల్లోని ప్రజలు గందరగోలానికి గురవుతున్నారని, అనేకమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
వారికి సహకారం అందించి ఫామ్ నింపడంలో బాధ్యతలు తీసుకోవాలన్నారు. దీంతో దొంగ ఓట్లను నిర్మూలించే అవకాశం ఉందన్నారు. ప్రతీ పది పోలింగ్ కేంద్రాలకు ఒకరు చొప్పున పేర్లను ఎంపిక చేసి వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం ఉందన్నారు. జులై 24 వరకు గడువు ఉన్నందున రెండు రోజుల ముందే పారం నింపి బీఎల్ఓ లకు అందజేయాలన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని దాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఓటరు జాబితాను ఆన్లైన్లో వ్యక్తిగతంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని దానికి సంబంధించిన లింకును బీఆర్ఎస్ బీఎల్ఎ లకు వాట్సప్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు. పలువురు బీఎల్ఏలు సందేహాలు వ్యక్తం చేయడంతో వాటిని నివృత్తి చేశారు.
ఆన్లైన్లో వ్యక్తిగతంగా ఎలా నమోదు చేసుకోవాలో ట్రైనర్ గుండేటి శ్రీధర్ వివరించారు. అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మేరకు జనాభా సర్వే నడుస్తుందని, ఇది శుభ పరిణామమన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు చెప్పిన సమస్యలను బీఎల్ఏలు పరిష్కరించాలన్నారు. ఫారాలు అందజేసిన వెంటనే బీఎల్వోల వద్ద నుండి రసీదు తీసుకోవాలన్నారు. అర్హులైన వారి ఓట్లను నమోదు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సర్పంచులు బోయిని రమేష్, ఒంటెల కిషన్ రెడ్డి, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు ఆకవరం శివప్రసాద్, కత్తుల రమేష్, ఎస్కే సిరాజ్, గిట్ల తిరుపతిరెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి, పిల్లి వేణు, సన్నీల్ల మల్లేష్, పరిపాటి రవీందర్ రెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి మండల నాయకులు రామోజు కృష్ణమాచారి, ఎండీ సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, బోయిని శ్రీనివాస్, మిట్టపల్లి మల్లేశం, కూతురు శరభంద రెడ్డి, హనుమాన్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.