పాలకుర్తి, జూన్18: రామగుండం బీఆర్ఎస్లో నయాజోష్ కనిపిస్తున్నది. పారిశ్రామిక ప్రాంతంలో కీలకమైన కేశోరాం కార్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో జయకేతం ఎగరేసి, కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొట్టడంతో కేడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. దాదాపు ఏడేండ్ల తర్వాత ఫ్యాక్టరీలో బీఆర్ఎస్ నేత, కేశోరాం గుర్తింపు సంఘం అధ్యక్షుడు కౌశికహరి ప్యానల్ ప్రధాన కార్యదర్శిగా అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో సంబురాల్లో మునిగితేలారు. కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం మంగళవారం నిర్వహించగా, ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 809 మంది ఓటర్లకుగాను 787 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఇందులో బీఆర్ఎస్ నేత కౌశికహరి ప్యానల్ అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.
శ్రీనివాస్‌కు 418 ఓట్లు రాగా, కాంగ్రెస్ నేత బయ్యపు మనోహార్‌రెడ్డి ప్యానల్ అభ్యర్థి నగునూరి రమేశ్‌కు 352 ఓట్లు వచ్చాయి. సదయ్యకు ఒకటి, నరేష్ తొమ్మిది ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లలేదు. నగునూరి రమేశ్‌పై మాదాసు శ్రీనివాస్ 66 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి బీ డానియల్ ప్రకటించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంపై కార్మికులు, పాలకుర్తి మండలంతోపాటు, అంతర్గాం, రామగుండం ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు జరుపుకొన్నారు. గత శాసనసభ, పార్లమెంట్లో ఓటమితో నిరుత్సాహంగా ఉన్న కేడర్‌కు ప్రతిష్టాత్మక కేశోరాం ఎన్నికల్లో విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది.