Narayanapur | గంగాధర, జూన్ 8 : గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్అండ్ఆర్ ప్యాకేజి క్రింద పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గత 15 రోజుల క్రితం గ్రామస్తులు ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతి పత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం నీటి పారుదల శాఖ, భూసేకరణ అధికారులతో కలసి రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంపులో భాగంగా ముంపునకు గురవుతున్న ఇండ్లు, స్థలాలను పరిశీలించి, గ్రామస్తులతో చర్చించారు.
రిజర్వాయర్ నీటితో నింపడం దుర్వాసన, నీటి జాలు, కీటకాలతో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ కు వివరించారు. గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌తో చర్చించి, నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ నల్ల వెంకట్ రెడ్డి, సర్పంచ్ దీకొండ బాబ లక్ష్మి మధు, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, ఎస్సై వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.