రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ‘దశాబ్దాల తరబడి వేములవాడను పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. ప్రభుత్వ ఫలాలు, పథకాలు గడపగడపకూ అందుతున్నాయి. దీంతో ప్రజల్లో సంతోషం కనిపిస్తున్నది. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తా. వేములవాడను మోడల్ సిటీగా డెవలప్మెంట్ చేసేందుకు నా వంతు కృషి చేస్తా. రాజన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ఉన్నతంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. బీఆర్ఎస్ టికెట్ రావడంతో హ్యాపీగా ఫీలవుతున్నా. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’నని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..
నమస్తే : టికెట్ వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?
చల్మెడ : చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. నాపై విశ్వాసం ఉంచి, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌కు నా ధన్యవాదాలు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
నమస్తే : మీ లక్ష్యం ఏమిటి?
చల్మెడ : నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో స్కూళ్లు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరమున్నది. మన ఊరు- మనబడిలో భాగంగా మా స్వగ్రామం మల్కపేటలో రూ.రెండు కోట్లతో పాఠశాల కట్టించా. నలభై మందికి ఒకే టీచర్ ఉండడంతో కేటీఆర్‌తో మాట్లాడా. ఆయన సహకారంతో ముగ్గురు టీచర్లను నియమించారు. విద్యార్థుల సంఖ్య అరవైకి చేరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు బళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, వారిని ఉన్నతంగా తీర్చి దిద్దాలన్నది నాఆశయం. అలాగే పల్లెలకు పూర్వవైభవం తీసుకురావాలన్నది నా కోరిక. అందరూ కలిసి కట్టుగా ఉండాలి. పట్టణాల్లో ఉన్న వారంతా పండుగలకు గ్రామాలకు రావాలి. ముఖ్యంగా యువత మంచి ఉద్యోగాలను పొంది, సమాజానికి మార్గదర్శకులుగా ఎదిగి జన్మనిచ్చిన ఊరికి సేవలందించేలా తీర్చి దిద్దాలన్నది నాలక్ష్యం.
నమస్తే : ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు?
చల్మెడ : మాది అర్బన్ బేస్ కాదు. రూరల్ బేస్. నేను వృత్తిరీత్యా కరీంనగర్లో ఉంటున్నా నా బాల్యమంతా గ్రామీణ ప్రాంతాల్లోనే గడిచింది. మా సొంతూరు మల్కపేట. తంగళ్లపల్లి మండలం చింతలఠాణా, బోయినిపల్లి మండలం కోరెం, రుద్రంగి మండలం మానాలలో మా మేనత్తలుంటారు. పల్లె వాతావరణమంటే నాకెంతో ఇష్టం. నేను ఊరిలో వ్యవసాయం కూడా చేశా. సెలవులు, పండుగ రోజుల్లో వచ్చి అందరితో సరదాగా గడిపేది. పల్లె ప్రజలతో మమేకమై గడిపితే ఆ ఆనందమే వేరు. అందుకే ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతా. వేములవాడలో అందరికీ అందుబాటులో ఉంటా. ఇప్పటికే సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యా.
నమస్తే : నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు గుర్తించారా..?
చల్మెడ : మూలవాగుపైన మూడు వంతెనలు నిర్మించాల్సి ఉన్నది. వెంట్రావుపల్లె, బావుసాయిపేట, మామిడిపల్లి గ్రామాల వద్ద లోలెవెల్ వంతెనలు ప్రతి వానకాలం కొట్టుకుపోతున్నాయి. దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో సమస్య ఏంటంటే భీమారం మండలం మోత్కురావుపేట గ్రామం, చందుర్తి, కథలాపూర్, వేములవాడలను కలిపే రోడ్డులో కొంత అటవీ భూమి ఉంది. ఆ ఫైల్ క్లియర్ అయితే ఈ గ్రామాలకు సుమారు 22కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. నేను గెలిస్తే సత్వరమే పరిష్కరిస్తా. కథలాపూర్, మేడిపల్లిలో చాలా వరకు డబుల్ రోడ్లు కాలేదు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అలాగే తక్కళ్లపల్లి వద్ద మంజూరైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నది. రుద్రంగిలో 35 పడకల దవాఖాన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య అందేలా చూస్తా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా.
నమస్తే : వేములవాడ క్షేత్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు?
చల్మెడ : నేను భక్తున్ని. కోనరావుపేట మండలంలో సొంతంగా టెంపుల్ కట్టిస్తున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రాజన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా. వేములవాడకు వచ్చే భక్తులకు, ఈ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తా. వేములవాడ మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తా.
నమస్తే : ప్రజాసమస్యలు ఎలా పరిష్కరిస్తారు?
చల్మెడ : నేను ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల బాగు కోసం కష్టపడుతా.ప్రజలు నావద్దకే రావాలన్నది ఏమి లేదు. నేనే ప్రజలకు వెళ్తా. గ్రామాల్లోనే గ్రామ సభలు పెడుతా. వారి సమస్యలు విని అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తా. ముంపు గ్రామాల సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా కృషి చేస్తా. ఇప్పటికే చాలా వరకు సమస్యలు గుర్తించాం.
నమస్తే : మీ గెలుపునకు పథకాలు దోహదపడుతాయా?
చల్మెడ : నాకు పార్టీ, కార్యకర్తల బలం ఉంది. అలాగే సీఎం కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరాయి. అవే నా గెలుపునకు దోహదం చేస్తాయి. ఇటీవలే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. నియోజకవర్గంలో 60వేల మందికి ఆసరా పింఛన్లు వస్తున్నాయి. 63వేల మంది రైతులకు రైతుబంధు వస్తుంది. 1002 మందికి రైతు బీమా పరిహారం వచ్చింది. మా ప్రాంతంలో ముఖ్యమైన సమస్య తాగునీరు. మల్కపేటలో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను కేసీఆర్ నిర్మించిండు. ప్రాజెక్టు వల్ల గ్రౌండ్ వాటర్ పెరగడమే కాకుండా కెనాల్ ద్వారా నీళ్లు వస్తున్నాయి. నాడు కరువుతాండవించిన నేలకు సీఎం కేసీఆర్ కృషితో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. ఈప్రాంత భూములు సస్యశ్యామలం అయ్యాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. మేడిపల్లి, కథలాపూర్ సూరమ్మ చెరువు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. చెరువుతో 32 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. బీఆర్ఎస్ అన్నా, సీఎం కేసీఆర్ అన్నా ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో నేను తప్పకుండా గెలుస్తా.