‘ప్రభుత్వం 80 వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇది నిరుద్యోగులకు మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాలి. ఇందుకు సహకారం అందిస్తాం. నిరుద్యోగ యువతీ యువకులు ప్రిపేర్ అయ్యేందుకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే లక్ష పుస్తకాలు సిద్ధంగా ఉంచాం. అభ్యర్థుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి వారం పుస్తకాలు తెప్పిస్తున్నాం. ఏకకాలంలో వెయ్యి మంది చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నాం. అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తాం. ప్రీ ఫైనల్ తరహాలో పరీక్షలు నిర్వహించి.. వారి సామర్థ్యానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.’ అని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి తెలిపారు. రాబోయే పోటీ పరీక్షల నేపథ్యంలో ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, శిక్షణ, అవగాహన తరగతులు, వివిధ కోచింగ్ సెంటర్లతో అనుసంధానమై నిర్వహించే ముందస్తు పరీక్షలు, డిజిటల్ లైబ్రరీ వంటి అనేక అంశాలను వివరించారు.
పోటీ పరీక్షల నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులు ప్రిపేరయ్యేందుకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే లక్ష పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని, అభ్యర్థుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి వారం తెప్పిస్తామన్నారు. రాబోయే పోటీ పరీక్షల నేపథ్యంలో ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– కరీంనగర్, మార్చి 12 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 2,03,647 పుస్తకాలున్నాయి. అందులో దాదాపు లక్ష పుస్తకాలు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయి. దీంతో పాటు ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షలకు బాగా ఉపయోగపడే మరో 7,077 పుస్తకాలను తెప్పించాం. గ్రూప్స్ నుంచి మొదలు కొని బ్యాంకింగ్ వరకు.. అలాగే మెడిసిన్, వివిధ రకాల పీజీ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించిన బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ విషయంలో మేం సంసిద్ధంగా ఉన్నాం. గతంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం పరిధిలో కేవలం 50 మంది మాత్రమే చదువుకునే అవకాశముండేది. దానిని ప్రస్తుతం 450 వరకు తీసుకెళ్లాం. ఇవి కూడా సరిపోవు. అందుకే గ్రంథాలయం నుంచి 20 లక్షలు, కలెక్టర్ సహాయంతో 30 లక్షలు.. మొత్తం 50 లక్షలతో కొత్తగా ఒక షెడ్‌ను నిర్మిస్తున్నాం. అతి త్వరలోనే దీనిని పూర్తి చేస్తాం. తద్వారా మరో 400 నుంచి 500 మంది చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే గ్రంథాలయం పక్కనే ఉన్న టీఎన్జీవో భవన్‌ను అడిగాం. టీఎన్జీవోస్ అధ్యక్షుడు జగదీశ్వర్ ఒక హాల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అందులో మరో వంద మంది ప్రిపేర్ కావడానికి ఆస్కారమున్నది. మొత్తంగా ఏక కాలంలో వెయ్యి మంది చదువుకునే వెసులు బాటు కల్పిస్తున్నాం. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా రూంలు ఏర్పాటు చేశాం. అలాగే ఫ్రీ వైఫై సౌకర్యం, సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మేయర్ సునీల్‌రావు సహకారంతో గ్రంథాలయం పరిధిలోనే 5కే భోజన వసతి సౌకర్యం ఏర్పాటు చేశాం. అలాగే మండల పరిధిలో ఉన్న గ్రంథాలయాల్లోనూ అన్ని పోటీ పరీక్షలకు సిద్ధంగా పుస్తకాలు అందుబాటులో పెడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే కోచింగ్ కేంద్రాలకు కావాల్సిన పుస్తకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఇప్పటికే వివిధ కోచింగ్ సెంటర్లతో మాట్లాడుతున్నాం. నోటిపికేషన్లకు అనుగుణంగా ఎంపిక చేసిన కోచింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నాపత్రాలు తెచ్చి ఇక్కడే ఎగ్జామ్ నిర్వహిస్తాం. తిరిగి వారు రాసిచ్చిన జవాబు పత్రాలను సదరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో మూల్యాంకనం చేయించి అభ్యర్థులకు ఇస్తాం. తద్వారా అభ్యర్థుల పరిణితితోపాటు వారి ఐక్యూ తెలుస్తుంది. వారి లోటుపాట్లు కూడా తెలుసుకునే అవకాశముంటుంది. అలాగే రెండు మూడుసార్లు ఎగ్జామ్ రాయడం వల్ల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భయం దూరమవుతుంది. దీనివల్ల చాలా మంది తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇందుకు సంబంధించిన డబ్బులను పూర్తిగా గ్రంథాలయమే సంబంధిత కోచింగ్ కేంద్రాలకు చెల్లిస్తుంది. అంతేకాదు.. ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే జిల్లాకేంద్రం గ్రంథాలయంతోపాటు మండలకేంద్రాల్లోని లైబ్రరీలకు కూడా పంపిస్తాం. అక్కడి వారు కూడా వచ్చి పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పిస్తాం.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోటీ పరీక్షలకు నిర్వహించిన క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. యువతీ యవకులు వాటిని చూసుకునే వెసులుబాటు కల్పించాం. ఇక లైబ్రరీకి వచ్చే వాళ్ల కోసం అవగాహన సదస్సులను పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఆయా నోటిఫికేషన్లను బట్టి ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇందుకోసం ఆయా సబెక్టుల్లో నిపుణులను రెండు నెలల పాటు పంపడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఇప్పటికే మాట్లాడి పెట్టారు. వీరితోపాటు గ్రూపు-1 అధికారుల సంఘంతో మాట్లాడాం. వారు కూడా అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించేందుకు అంగీకారం తెలిపారు.
తప్పకుండా తెప్పిస్తాం. ఇందు కోసం గ్రంథాలయం పరంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్రంథాలయం పరిధిలో ఆన్ డిమాండ్ రిజిస్టర్ పెడుతున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు గ్రంథాలయంలో లేని పుస్తకాలను సదరు రిజిస్టర్లో నమోదు చేయవచ్చు. వాటిని పరిశీలించి వారం వారం తెప్పిస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువతీ యువకులు ఇంకా ఏమైనా కొత్త పుస్తకాలు కావాలని కోరితే తప్పకుండా వాటిని తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం.
స్మార్ట్ సిటీలో భాగంగా గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, సునీల్‌రావు సహకారంతో 6 కోట్ల వ్యయం అంచనాతో జీ+4 అంతస్థుల భవనాన్ని ప్రస్తుత గ్రంథాలయ పరిధిలోనే నిర్మించబోతున్నాం. ఇందులో 2 కోట్లతో డిజిటల్లైబ్రరీ ఉంటుంది. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన ఇల్లంతకుంట, గన్నేరువరం, కొత్తపల్లి మండలాల్లోనూ నూతనంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం.