Rajanna temple | వేములవాడ, జూన్ 15: వేములవాడ రాజన్న ఆలయంలోని అధికారుల వేధింపులతోనే నా కొడుకు మృతి చెందాడని ఓంకార్ తల్లీ పెంట లక్ష్మి ఆరోపించారు. పెంట ఓంకార్ (32) అనే యువకుడు వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండగా 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ కుమారుడు ఇంజనీరింగ్ భాగంలోని ఇద్దరు అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంధువులు కాలనీ వాసులతో కలిసి ఆమె రాజన్న ఆలయ కార్య నిర్వహణ అధికారి కార్యాలయం ముందు ఆదివారం ధర్నా నిర్వహించారు.
వారి సొంత పనులకు వాడుకున్న అధికారులు 15 రోజులపాటు విధులకు హాజరు కావడం లేదంటూ గైర్హాజరు వేస్తామని, ఉద్యోగంలో నుండి కూడా తొలగిస్తామని వేధింపులకు పాల్పడడమే కాకుండా రాతపూర్వకంగా క్షమాపణ పత్రం రాయించుకున్నారని ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై మే 30న ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి వాపోయింది. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి పరిపాలన కార్యాలయం ఏఈవో శ్రవణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.