Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 9: గుర్తుల గుర్తుంచుకో రామక్క.. గులాబీ గుర్తుంచుకో రామక్క…అంటూ జానపద పాటలతో వీధులలో మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. క్షణం తీరిక లేకుండా తిరిగిన ప్రచార రథ చక్రాలు ఎక్కడికక్కడనే ఆగిపోయాయి. మొత్తంగా రామగుండంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు ప్రశాంతంగా ముగియగా, పోలింగ్ కు మరో 24 గంటల సమయం ఉండగా, అభ్యర్థులు డిజిటల్ ప్లాట్ఫాం ను ఆశ్రయిస్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రచారంకు ఆరు రోజుల గడువు ఇవ్వగా, రామగుండం నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో గల 60 డివిజన్లలో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఈ ఆరు రోజులు ప్రచారంను హోరెత్తించారు. తెల్లవారింది మొదలు డివిజన్లలో మైకుల ప్రచారం మార్మోగింది.
ఉదయం నుంచి రాత్రి వరకు మైకుల శబ్ధం చెవులను గడ్డ కట్టించింది. గల్లీ గల్లీలో జానపద పాటలే వినిపించాయి. సోమవారం సాయంత్రం 5 గం.లతో ప్రచారం ముగియగా ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. ఇక అభ్యర్థులు పరోక్షంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఓట్లు అభ్యర్థించే పనిలో పడ్డారు. 11న పోలింగ్ ఉండగా మంగళవారం ఒకరోజు సమయం ఉండటంతో ఈ రాత్రి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు పంచేందుకు మార్గాలను వెతుక్కుంటున్నారు. గత ఆరు రోజుల పాటు పాటలు, డప్పు చప్పుళ్లు, ప్రచార వాహనాల్లో మైకుల మోతలతో దద్దరిల్లిన వీధుల్లో ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవహించడంతో ప్రజలు హమ్మయ్యా.. అంటూ ఉపశమనం పొందుతున్నారు.