Indiramma houses | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 29 : ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారి ఇండ్లు రద్దు చేస్తుండటంతో, నిర్మాణాలు మొదలు పెట్టని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి స్థలం ఉండి గూడు నిర్మించుకునే స్థోమత లేక అద్దె ఇళ్ళలో నివసిస్తూ వారికి ఇండ్లు మంజూరైనా, ఇప్పటికీ ఇండ్ల పనులు మొదలుపెట్టలేదనే సాకుతో వాటిని రద్దు చేయటంపై మంజూరు పత్రాలు అందుకున్న వారిలో నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి.
ఇంకా నిర్మాణాలు చేపట్టని వారి ఇండ్లు రద్దు చేయాలంటూ కొద్దిరోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. 871 మంది ఇళ్ళ నిర్మాణానికి నిరాసక్తత కనబరుస్తున్నారంటూ, వారి వద్ద నుంచి రిలింగ్విస్ లెటర్లు తీసుకుని ఉన్నతాధికారులకు నివేదించగా, వీరి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలంటూ ఆదేశించినట్లు సమాచారం. కాగా, తమకు మళ్ళీ మంజూరు చేస్తామంటూ చెప్పి సంతకాలు తీసుకున్నారని, రాబోయే రోజుల్లో కొత్త ఇండ్ల మంజూరీ ఉంటదో… ఉండదో.. తమకు మంజూరీ చేస్తారో.. చేయరోననే ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతోంది.
అర్ధం పర్ధం లేని నిబనంధనలు విధిస్తూ, ఈ చేత ఇచ్చి ఆ చేత వాపస్ తీసుకుంటున్న ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో అత్యధికంగా గంగాధర మండలంలో 114, మానకొండూరులో 105, వెన్కెపల్లి సదాపూర్‌లో 100, గన్నేరువరంలో 85, వీణవంకలో 80, రామడుగులో 76 చొప్పదండిలో, ఇల్లందకుంట మండలాల్లో 55 చొప్పున, శంకరపట్నంలో 51, జమ్మికుంటలో 39, హుజురాబాద్‌లో 38, కొత్తపల్లిలో 30, తిమ్మాపూర్ లో 21, కరీంనగర్ రూరల్‌లో 16, చిగురుమామిడిలో ఆరుగురు లబ్దిదారుల నుంచి మంజూరైన ఇండ్లు నిర్మించుకోలేక వదులుకుంటున్నట్లు లిఖితపూర్వక పత్రాలు తీసుకున్నారు.
హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మున్సిపాల్టీలతో పాటు కరీంనగర్ నగర పాలక సంస్థలో మాత్రం ఎవరూ కూడా రిలింగ్విష్డ్ లెటర్లు ఇవ్వలేదని తెలుస్తోంది. జిల్లాలో రెండు విడతల్లో ఇప్పటివరకు 8233 ఇండ్లు మంజూరు కాగా, వీటిలో 871 ఇండ్ల మంజూరీ రద్దు చేశారు. 5816 ఇండ్లకు ముగ్గుపోసినట్లు అధికారులు పేర్కొంటుండగా, ఇప్పటివరకు 3683 ఇండ్లు మాత్రమే గ్రౌండింగ్ కాగా, వీటిలో ఇంకా 2942 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలోనే నిలవగా, 394 రూఫ్ లెవల్‌కు చేరుకున్నాయి కేవలం 322 ఇండ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయంటే, నిరుపేద లబ్దిదారులకు సాయం చేయటంలో ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ది ఏపాటిదితో తేటతెల్లమవుతుందనే అభిప్రాయాలు లబ్దిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇండ్ల నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి రుణాలందిస్తామంటూ ప్రకటించినా, అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. లబ్దిదారులకు అవసరమైన సాయం చేస్తామని అటు అధికారులు, ఇటు అధికార నేతలు పదే పదే ప్రకటనలు చేయటంతో దరఖాస్తులు చేసుకోగా. తీరా ఎలాగైనా ఇళ్ళ నిర్మాణం మొదలుపెట్టాల్సిందేనంటూ ఒత్తిడి చేయటంతోనే తమ వద్ద డబ్బుల్లేవంటూ మంజూరైన ఇండ్లను వదులుకున్నట్లు లబ్ధిదారులు వాపోతుండటం గమనార్హం.