మంథని, జూన్ 8: మంథని (Manthani) పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న క్రీడ మైదానంలో ఓ యువకుడిపై గుర్తు తెలియనీ దుండగులు బీరు సీసాలతో తలపై దాడి చేసి హత్యయత్నం చేసిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన బొల్లంపల్లి సంతోష్ గౌడ్ అనే యువకుడు శనివారం రాత్రి 9.0 గంటల తర్వాత క్రీడామైదానంలో మల మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో వెనుకనుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని దుండగులు తలపై బీరు సీసాలతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలపై గాయాలతో ఉన్న సంతోష్‌ను మొదట మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గోదావరిఖని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలువురుపై వివాదాస్పదంగా సంతోష్ పోస్టింగులు పెడుతూ ఉండేవాడు. మంథనిలో జరుగుతున్న అక్రమ దందాలతో పాటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులపై సైతం సంతోష్ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ ఉండేవాడు. కాగా, సంతోష్‌పై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది.