“2014కు ముందు సమైక్యాంధ్ర పాలనలో మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయి.. బల్దియా అంటే తిన్నామా.. తాగినమా.. పోయినమా.. అనే మాదిరిగా ఉండేవి. 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తెలుసు. ప్రణాళికాబద్ధంగా పల్లె, పట్టణ ప్రగతితో పాటు విధులు, నిధులు కేటాయించి ఆదర్శంగా తీర్చిదిద్దాం. తొమ్మిదన్నరేండ్ల కాలంలోనే తెలంగాణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దేశంలో తెలంగాణ జనాభా 3 శాతమే. కానీ, జాతీయ స్థాయిలో మన మున్సిపాలిటీలకు అనేక అవార్డులు రావడం గర్వకారణం. ఇది నేను చెబుతున్నది కాదు. కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇచ్చి సత్కరించింది. పాలకవర్గాల సమష్టి కృషితోనే సాధ్యమైంది.”
సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్, జనవరి 24 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలను ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పాలకవర్గాలకు నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కేసీఆర్ చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని మున్సిపాలిటీలకు నిధులు అందించారన్నారు. 30 ఏండ్ల తర్వాత కూడా 2014 నుంచి తొమ్మిదన్నరేండ్ల పాలననే ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన కొన్ని రోజుల్లోనే నిధులు విడుదల కాకుండా చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సిరిసిల్ల అభివృద్ధి కోసం మున్సిపల్ మంత్రిగా రూ.40 కోట్ల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ వచ్చి వాటిని నిలిపివేసిందన్నారు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మాట తప్పిందన్నారు. మాటలు కోటలు దాటినయ్ కానీ, చేతలు గడప దాటలేదని ఎదేవా చేశారు. ఇప్పుడు జరుగుతున్న గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారని, కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే కొట్టాలన్నంత కోపంలో ఉన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 నెలల్లోనే 1.40 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు.
గతంలోనే ప్రజాపాలన నిర్వహించి కోటి 60 లక్షల దరఖాస్తులు తీసుకున్నామని చెప్పిన సీఎం రేవంత్, మళ్లీ గ్రామ, వార్డు సభల పేరుతో ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దరఖాస్తుల కోసం పెట్టే ఖర్చులతో జిరాక్స్ సెంటర్లకు గిరాకీ పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. “గుడ్లు పీకి గోటీలు ఆడుతాం.. పేగులు తీసి మెడలేకుంటాం.. అని డైలాగ్‌లు కొట్టడం సులభమే కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేసి చూపాలి” అని హితవుపలికారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తున్నదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని, సంక్షేమ పథకాల గురించి అడిగిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా నాలుగేండ్లు ఉన్నాయని, పనిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. రేవంత్‌రెడ్డి వందశాతం రుణమాఫీ చేశామని చెప్తే మరో పక్క రైతు రుణ మాఫీ కాలేదని సీనియర్ నాయకుడు, మంత్రి దామోదర రాజనరసింహనే చెబుతున్నారని తెలిపారు. మంత్రులు గాలి మోటర్లు ఎక్కి గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారని, ప్రజల్లోకి వెళ్లేందుకు కిందికి దిగడం లేదని ఎద్దేవాచేశారు. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
తాను సిరిసిల్లలోని పలు వార్డుల్లో తిరిగానని, కేసీఆర్‌పై గానీ, మనపైగానీ అభిమానం పోలేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనకే ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పోయింది అధికారం మాత్రమేనని, అభిమానం చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. పదవులు ముగిసినప్పటికీ కౌన్సిలర్లు తమ వార్డులో అందుబాటులో ఉండాలని, మళ్లీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పని చేసే నాయకులను ప్రజలు వదులోకోరని, గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, రామతీర్థపు రాజు, న్యాలకొండ రాఘవరెడ్డి, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, సత్తార్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండాను ఎగరవేద్దాం. గత పాలకవర్గం హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేశాం. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. బీఆర్ఎస్పైనే ప్రజల్లో విశ్వాసం ఉంది. ప్రజలందరి ఆశీర్వాదంతో ఇదే ఉత్సాహంతో పని చేసి మరోసారి విజయం కోసం ముందుకు సాగాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగరవేద్దాం.