కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 22 : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరుకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగాల్లో నియమించాలని, మృతి చెందిన కార్మికుడి దహన సంస్కారాలకు రూ.30 వేలు తక్షణమే అందించాలన్నారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధపడాలని కార్మికులకు పిలుపు నిచ్చారు. ఈ ధర్నాలో సీఐటీయూ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్, నాయకులు రవి, పోచయ్య, చంద్రకళ, సరోజన, లక్ష్మి పాల్గొన్నారు.