కరీంనగర్లో తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నగరపాలక అధికారులు అమలులోకి వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నారు. చెత్త ఆటోల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పారిశుధ్య అధికారులు.. కమర్షియల్ చెత్తను సేకరించే కంపెనీకి తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకురావాలన్న నిబంధనను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ సంస్థకు చెందిన ట్రాక్టర్లు అంతా కలగలిపే తరలిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సదరు సంస్థ అడ్డగోలుగా యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నా.. అధికారులు మాత్రం ఈ విషయాన్ని ‘మూమూలు’గానే తీసుకుంటున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 15 : కరీంనగర్లోని ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, హాస్టళ్ల నుంచి చెత్తను సేకరిస్తున్న ప్రైవేట్ సంస్థ యాజమాన్యం తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయకుండానే డంప్యార్డుకు తరలిస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. ఈ విషయమై డంప్యార్డుకు చెందిన సిబ్బంది పారిశుధ్య విభాగం కీలక అధికారులకు సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. స్వచ్ఛ ఆటోల విషయంలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఒత్తిడి తెస్తున్న అధికారులు.. ఈ సంస్థ విషయంలో ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ డంప్యార్డుకు చెత్తను వేరు చేయకుండా వచ్చిన వాహనాలను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తే కేవలం తాత్కాలిక చర్యలు చేపట్టి వదిలివేశారన్న విమర్శలు వస్తున్నాయి. అంటే.. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆ సంస్థతో కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డగోలుగా యూజర్ చార్జీలు
సంస్థ ప్రతినిధులు వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి అడ్డగోలుగా నెలకు రూ.500 నుంచి రూ.4వేల వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పలు సంస్థల వద్ద పూర్తిగా కాగిత వ్యర్థాలను తీసుకపోవడానికి కూడా రూ.వేలలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాగితపు వ్యర్థాలను కొందరు వ్యక్తుల ఆయా వ్యాపార సంస్థల నుంచి ఉచితంగా తీసుకపోవడానికి ముందుకు వస్తుంటే.. ఈ కమర్షియల్ చెత్త సేకరించే యజమానులు మాత్రం భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారని కార్పొరేటర్లే విమర్శిస్తున్నారు. ఈ విషయంలో గతంలోనూ విమర్శలు వచ్చినా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో వారికి అడ్డూఅదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి.