Odela | ఓదెల, జనవరి 14 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని మండలంలోని నాంసానిపల్లి, ఓదెల, శానాగొండ, లంబాడి తండా గ్రామాల్లో మహిళలకు బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను మహిళలకు అందజేశారు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేసి మహిళలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించాలని ఉద్దేశంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సహించామన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయం కలకాలం ఉండేలా మనందరం కృషి చేయాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమాలలో పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు గంగిశెట్టి ప్రభాకర్, గుగులోత్ నిమ్మా నాయక్, కానికిరెడ్డి సతీష్, జీల రాజు, ఉపసర్పంచులు గుగులోతు లింగేష్ నాయక్, వీరవేని లావణ్య, గోపతి శ్రీలత, వార్డు సభ్యులు, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్ వీరవేణి రవి తదితరులు పాల్గొన్నారు.