‘మాది నిరుపేద దళిత కుటుంబం. కష్టపడి చదువుకున్న. వీఆర్ఏ నౌకరీ పదకొండేండ్లు చేసిన. రెండేండ్లు మున్సిపల్ వార్డు ఆఫీసర్‌గా పని చేసిన. తర్వాత టీచర్ కొలువు సాధించిన. సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకున్న. ఎనిమిది నెలలు ఉద్యోగం చేసిన తర్వాత టర్మినెట్ చేసిన్రు. నేను ఏ తప్పు చేయకుండానే తీసేసిన్రు. కనీసం సమాచారం ఇవ్వలేదు. వివరణ తీసుకోలేదు. పోని అంతకు ముందు పదమూడేళ్లు చేసిన మున్సిపల్ వార్డు ఆఫీసర్ పోస్టు అయినా సర్కారు నిబంధన లీన్ ప్రకారం ఇవ్వాలని వేడుకుంటున్నా కనికరిస్తలేరు. ప్రభుత్వం, అధికారుల పైశాచికత్వంతో నా పరిస్థితి అధ్వానంగా మారింది. భార్యాపిల్లను పోషించుకునేందుకు సెంట్రింగ్ పనికి పోతున్న’ అని కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన ముదిగంపల్లి లక్ష్మీరాజం కంటతడి పెడుతున్నడు. చేయని తప్పుకు తనను బలిచేయవద్దని, మున్సిపల్ ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉన్నదని, విద్యాశాఖ అధికారులు స్పందిచడం లేదని వాపోతున్నాడు. సర్కారు స్పందించకుంటే తనకు చావే గతని, ఇప్పటికైనా తనపై దయ చూపాలని వేడుకుంటున్నాడు.
జగిత్యాల, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ముదిగంపల్లి లక్ష్మీరాజం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివాడు. అనంతరం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఎడ్ (మానసిక విద్యార్థులకు బోధన శిక్షణ) చేశాడు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాత పూర్వక పరీక్షకు హాజరై వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) పోస్టుకు ఎంపికయ్యాడు. పదకొండేళ్లపాటు అదే పోస్టులో కొనసాగాడు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్ఏ పోస్టులు రద్దు చేశారు. వీఆర్ఏలు, వీఆర్వోలను ఇతర శాఖల్లో రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వార్డు అధికారులుగా పంపించారు.
లక్ష్మీరాజం మున్సిపల్ శాఖలో వార్డు అధికారి పోస్టును ఎంపిక చేసుకోవడంతో ఆయనను 2023లో వేములవాడ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా పంపించారు. అక్కడ ఆయన పని చేస్తుండగానే.. రేవంత్ సర్కారు 2024లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేసింది. లక్ష్మీరాజంకు స్పెషల్ బీఎడ్ ఉండడంతో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే స్పెషల్ బీఎడ్ రెన్యువల్ లేకపోవడంతో డీఎస్సీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు ముగిసిన తెల్లవారి రెన్యువల్ సర్టిఫికెట్‌ను దాఖలు చేశాడు. డీఎస్సీ ఫలితాల కంటే మూడు రోజుల ముందే సమర్పించడంతో డీఎస్సీలో ఆయనను విద్యాశాఖ ఎంపిక చేయగా.. 2024 అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఎంపిక ఉత్తర్వులను తీసుకున్నాడు.
కొడిమ్యాల జడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా నియామకమయ్యాడు. తాను పనిచేసిన వేములవాడ మున్సిపల్ నుంచి రిలీవ్ అయి, కొడిమ్యాల జడ్పీ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో జిల్లా విద్యాధికారి 2025 మార్చిలో లక్ష్మీరాజంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అక్టోబర్ 5లోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదంటూ గతేడాది మే 8న ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లక్ష్మీరాజం హతాశుడయ్యాడు. అప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు.
ఉపాధ్యాయ పోస్టు నుంచి లక్ష్మీరాజంను తొలగించడం, ఆయన పడుతున్న వేదనను వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’ ఈ యేడాది ఏప్రిల్ 14న ‘సర్కారు నిర్లక్ష్యం.. కొలువు మాయం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి మున్సిపల్ శాఖ స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనల ప్రకారం లీన్ అవకాశం ఉంటుందని, దాని ఆధారంగా లక్ష్మీరాజంను తిరిగి మున్సిపల్ శాఖలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ల నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఉద్యోగం చేస్తూ మరో శాఖలో ఉద్యోగం సాధించి అందులోకి వెళ్తే, నాలుగు సంవత్సరాల పాటు లీన్ అవకాశం కల్పిస్తారు.
మరో శాఖలోకి వెళ్లిన ఉద్యోగి, నాలుగేండ్ల వ్యవధిలో తాను వెళ్లిన శాఖ నచ్చకపోయినా, ఇబ్బందులు ఎదురైనా తిరిగి మాతృశాఖకు తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పిస్తూ నిబంధనలున్నాయి. చాలా మంది ఉద్యోగులు ఇతర శాఖల్లోకి వెళ్లి, అక్కడి విధానాలు నచ్చక తిరిగి మాతృశాఖల్లోకి తిరిగి వచ్చారు. మున్సిపల్ శాఖ నుంచి లక్ష్మీరాజం ఏడాదిన్నర క్రితమే విద్యాశాఖకు వెళ్లి ఉండడంతో లీన్ నిబంధన ఆధారంగా మున్సిపల్ శాఖలోకి తిరిగి వెళ్లేందుకు అవకాశం దక్కింది. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు సైతం లక్ష్మీరాజంను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సరేనన్నారు. అయితే దీనికి మున్సిపల్ ఉన్నతాధికారులు ఒక్క షరతు విధించారు. లక్ష్మీరాజం టర్మినేషన్ కాకుండా, ఆయనకు లాస్ట్ పే సర్టిఫికెట్ (ఎల్పీసీ) ఇస్తే ఆయనను విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. టర్మినేషన్ అయిన ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం లక్ష్మీరాజం విద్యాశాఖ అధికారులను సంప్రదించాడు. లీన్ నిబంధనల ప్రకారం తనకు విద్యాశాఖ నుంచి ఎల్పీసీ ఇస్తే తనను మున్సిపల్ శాఖ అధికారులు తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. తనపై దయచూపి ఎల్పీసీ సర్టిఫికెట్ ఇస్తే పూర్వ ఉద్యోగమైనా చేసుకుంటానని వేడుకున్నాడు. దీనికి విద్యాశాఖ అధికారులు స్పందించడం మానివేశారు. తమ చేతుల్లో ఏమి లేదని, హైదరాబాద్ వెళ్లి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కలువాలని తేల్చిచెప్పారు. హైదరాబాద్ వెళ్లి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కలిస్తే జిల్లా విద్యాశాఖ అధికారులను కలువాలని సూచించారు. దీంతో లక్ష్మీరాజం దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అటూ ఇటూ తిరుగుతున్నా పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.