Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఉదయం 10.45 గంటలకు కూడా ఏ ఒక్క ఉద్యోగి రాలేదు.. కార్యాలయాలు తెరుచుకోలేదు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుండడంతో.. ముఖ్యమైన పనుల మీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల పాటు నిరీక్షణ చేయాల్సి వస్తుంది.
వేములవాడలోని తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే పైస్థాయి నుండి కింది స్థాయి వరకు ఏ ఒక్క ఉద్యోగి కూడా సమయానికి రావడం లేదు. వివిధ పనుల కోసం వచ్చి కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్న ప్రజలకు మాత్రం సమాధానం చెప్పే నాథుడే లేరు. కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా.. ఏ ఒక్క అధికారి తనకు కానరావడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రతి రోజు ఇలాగే జరుగుతుందని అక్కడికి వచ్చిన వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పనిచేసే అధికారుల్లో చలనం వచ్చి సరైన సమయానికి ఆఫీసుకు చేరుకొని ప్రజల బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు కోరుతున్నారు.