బోయినపల్లి, జూన్ 30 : కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణం చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. బో యినపల్లి పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. వేములవాడ మండలం రుద్రవరం గ్రా మానికి వంకాయల రాజనర్సు, లక్ష్మీ దంపతు లు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కి ఇద్దరు కూతుళ్లు రజిత(28) అలియాస్ నేహ, కవితతోపాటు కొడుకు రంజిత్ ఉన్నారు. పెద్ద కూతురు రజిత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఆ సమయంలో కరీంనగర్‌లోని సుభాష్‌నగర్ కు చెందిన మహ్మద్ అలీతో పరిచయం ఏర్పడి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు ఎండీ అయాబ్ (7), ఉస్మా న్ హైమద్(14 నెలలు), కూతురు అస్రె జాబి న్(5) ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి భర్త కట్నం కోసం వేధింపులకు గురి చే స్తున్నాడు. నిత్యం మద్యం తాగి ఇబ్బందులు పెట్టాడు. మూడేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు, భార్య పై డీజిల్ పోసి చంపుతానని బెదిరించగా, అప్పుడు మహ్మద్ అలీపై వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో వరకట్నంతోపాటు హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసు విషయంలో రెండు నెలల క్రితం అత్తగారి కుటుంబ సభ్యులు, భార్య రజిత అలియాస్ నేహతో మాట్లాడి ఇక నుంచి భార్యా పిల్లలను మంచిగా చూసుకుంటానని, కట్నం డబ్బులు అడగనని, మద్యం తాగనని మహ్మద్ అలీ వారితో రాజీ కుదుర్చుకున్నాడు. దీంతో వారు అతని మాటలు నమ్మి రాజీకి ఒప్పుకుని లోక్ అదాలత్‌లో కేసు కొట్టి వేయించారు. తర్వాత అహ్మద్ అలీ మళ్లీ అదే విధంగా వేధింపులకు గురి చేయడంతోపాటు ఈ నెల 27న రజిత, పిల్లలను ఆటోలో రుద్రవరంలోని తల్లి గారింటి వద్ద దింపి కట్నం తీసుకురావాలని చెప్పి వెళ్లాడు. అప్పుడు రజిత, ఆమె తల్లిగారింటి కుటుంబ సభ్యులు వెంటనే వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు మహ్మద్ అలీని పిలిపిస్తామని చెప్పి, మూడోరోజు రావాలని వారిని పంపించారు. మరునాడు 28న మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజిత ఇంటి నుంచి తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది.
పుట్టింటి వారు కూడా ఆమె భర్త ఇంటికి వెళ్లిందని భా వించారు. శుక్రవారం బోయినపల్లి మండలం కొదురుపాక హైలెవల్ వంతెన పక్కన నీటిలో వీరి నలుగురి మృతదేహాలు తేలి ఉండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బోయినపల్లి ఎస్ఐ మహేందర్, ఏఎస్ఐ బాబు అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. రజిత జేబులో ఉన్న చిన్న నోట్ బుక్‌లో ఆమె భర్త ఫోన్ నెంబర్, ఆటో నెంబర్ రాసి ఉండగా అతనికి సమాచారం ఇచ్చి వివారాలు తెలుసుకున్నారు. తర్వాత రజిత పుట్టింటి వారికి సమాచారం అందివ్వగా, ఆమె సోదరుడు రంజిత్ వచ్చి పోలీసులకు పూర్తి సమాచారం అందించాడు. తర్వాత పోస్టుమార్టం కోసం మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ వెంకటేశ్ వివరాలు నమోదు చేసుకున్నారు.