Godavarikhani | కోల్ సిటీ, జూన్ 14: గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా… శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడ ఈ సమస్య ఎప్పటికీ ఉన్నదే అయినా.. ఇటీవల రామగుండం నగర పాలక సంస్థ నగరంలో కోతులను పట్టడానికి రూ.10లక్షలు కేటాయించి ఓ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించినా ఇదేం తిప్పలు రా నాయనా అంటున్నారు.
స్థానికులు. సదరు ఏజెన్సీ నిర్వాహకులు కేవలం రామగుండంలోని రైల్వే స్టేషన్ వద్ద బుధ, గురువారాల్లో అడపా దడపా ఉన్న కోతులను బంధించి తీసుకవెళ్లి ఆడవిలో వదిలిపెట్టి చేతులు దులుపుకున్నారు. కానీ, గోదావరిఖని జవహర్ నగర్, ఫైవింక్లయిన్ ఏరియాలో మాత్రం శత మర్కటాలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. అటు స్టేడియంలో వాకర్స్ ను ఇబ్బందులకు గురి చేస్తూ.. ఇటు సమీప ఇళ్లపై కోతి చేష్టలతో స్థానికులను హడలెత్తిస్తున్నాయి.
కోతుల బెడద నివారణ కోసం ఇంజనీరింగ్ అధికారులు కార్పొరేషన్ నుంచి రూ.10లక్షలు కేటాయించినా కంటి తడుపు చర్యగానే అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గారూ… జర జవహర్ నగర్ ఏరియాపై దృష్టి పెట్టాలని వాకర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం గాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.