Mock polling | ధర్మపురి, డిసెంబర్12 : గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్దతిలో ఓటు హక్కు పాధాన్యతపై అవగాహన కల్పించేలా ధర్మపురి పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్థులే అభ్యర్థులుగా, పోలింగ్ అధికారులు, సిబ్బంది పాత్రల్లో పాల్గొని ఎన్నికల విధానాన్ని అనుభవించేలా చేశారు. బ్యాలెట్ బాక్సు, గుర్తింపు ప్రాసెస్, ఓటింగ్ గదులు, మొదలైన వాటిని ప్రదర్శిస్తూ వాస్తవానికి దగ్గరగా నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న విద్యార్థులు రెండు రోజులుగా ప్రచారం నిర్వహించి ఓటర్లు అయిన విద్యార్థులను తమవైపు ఆకర్శించుకునే ప్రయత్నం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు మాక్ పోలింగ్ ముగిసిన అనంతరం లెక్కింపు జరగగా పాఠశాలకు చెందిన విద్యార్థిని చెన్నోజు సమన్వి విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులుగా పాత్ర పోషిస్తున్న విద్యార్థులు ప్రకటించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నాగశ్వేతశ్యాంసుందర్ మాట్లాడుతూ ఇది విద్యార్థుల్లో బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నమన్నారు. ఓటు హక్కు ఒక బాధ్యతగా భావించే అలవాటు ఏర్పడుతుందని, అభ్యర్థులుగా, ఓట్లను అభ్యర్థించడంలో నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. మాట్లాడడం, పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.