కొడిమ్యాల/ సారంగాపూర్, ఫిబ్రవరి 9 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కొత్త కోనేరు నిర్మాణం, శాశ్వత ప్రాతిపదికన మంచినీటి వసతి సౌకర్యం కల్పించారని చెప్పారు. ఆదివారం సాయంత్రం తర్వాత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆమె కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకున్నారు. బేతాళస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత ఆల యం వెలుపల మాట్లాడారు. కోరిన కోర్కె లు నెరవేర్చే కొంగుబంగారం లాంటి దేవుడు అంజన్న అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంజన్న సన్నిధిలో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసిందని గుర్తు చేశారు. వరదకాలువ నుంచి సంతలోని లొద్ది వరకు ప్రత్యేక పంప్‌హౌస్, ప్రత్యేక దారి, ఆలయ నూతన కార్యనిర్వహణాధికారి కార్యాలయ భవనం, ఆలయానికి 333 ఎకరాల భూముల కేటాయింపులతోపాటు వెయ్యి కోట్లతో ప్రత్యేకంగా ఆలయ అభివృధ్ధి కోసం ప్రణాళికలను రూపొందించిందని గుర్తు చేశారు.
ఆ ప్రణాళికలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యంపేట మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి ఆలయ అభివృద్ధి విషయంలో ప్రత్యేక కృషి చేస్తున్నారని అభినందించారు. అనంతరం బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వెళ్లారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించారు. ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 32 లక్షలు మంజూరు చేశామని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Karimnagar1