జగిత్యాల, జూన్ 16, (నమస్తే తెలంగాణ)/ మల్యాల : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, సర్కారు అక్రమాలపై తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అయినా మీ బెదిరింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని, తమ మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదురొంటామని స్పష్టం చేశారు. సోమవారం ఆమె జగిత్యాలలో పర్యటించారు.
జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం తమ బీఆర్ఎస్ ఎంపీ దామోదర్‌రావు ఎంపీ లాడ్స్ నుంచి 90 లక్షలు ఇచ్చారని, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మరో 10 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం మీడియాతో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ధ్వజమెత్తారు.
రైతు భరోసా అని రైతులను, స్కూటీలు అని యువతులను, జాబ్ కాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్లు పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదని, మహిళలకు 2,500 ఇవ్వలేదని ఆగ్రహించారు. హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. అయినా తాము వేధింపులకు భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు.
Karimnagar6
కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ భవన్‌కు తాళం వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో తమ కార్యకర్తలు, నాయకులు బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీశ్, దామోదర్‌రావు, ఆనంద్‌రావు, శీలం ప్రియాంక, అనురాధ, దావ సురేశ్, తదితరులు పాల్గొన్నారు..