సింగరేణి సంస్థ, కార్మికులకు మన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంత చేసిండో అంత మరిచిపోతరా..? చెప్పుడు మాటలు, అబద్ధపు హామీలు నమ్మి మీరెట్ల మోసపోతరు? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. కేసీఆర్ లేకుంటే సింగరేణి సంస్థ ఎట్లుండేదో గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పటికి మించిపోయింది లేదు. ఆగమవుతున్న రాష్ర్టాన్ని, సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు మళ్లీ పిడికిలి బిగించి పోరాడుదాం. మీ సోదరిగా ముందుండి నడుస్త. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టేందుకు నా వెనుక మీరు నడవండి చాలు. వచ్చే సింగరేణి ఎన్నికల్లో మళ్లీ టీబీజీకేఎస్ జెండా ఎగరేద్దాం.
– కల్వకుంట్ల కవిత
కోల్‌సిటీ, ఏప్రిల్ 23 : సింగరేణి కార్మికుల హక్కుల కోసం పిడిగిలి ఎత్తి పోరాడుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీలు, యూనియన్లను బొందపెడుదామని, వచ్చే సింగరేణి ఎన్నికల్లో 11 ఏరియాల్లో టీబీజీకేఎస్ జెండా ఎగరవేద్దామన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సైన్యంలా కదలిరావాలని, మరో కుంభమేళాను తలపించాలని పిలుపునిచ్చారు.
బుధవారం ఆమె పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆ తర్వాత గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఆమెకు ప్రధాన చౌరస్తాలో యూనియన్ నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఉగ్రమూకల దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చౌరస్తాలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. తర్వాత సమ్మేళనానికి హాజరై కార్మికులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాడు సింగరేణి అంటే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి ఒక్కటే అన్నట్టు ఉండేదని, తాను ఓ సందర్భంలో దుబాయికి వెళ్లినప్పుడు అక్కడి ఆయిల్ బంకర్‌ను చూస్తే రామగుండంలో ఉండే వేడికంటే మూడింతల వేడిలో పని చేసేవారని గుర్తు చేశారు.
అప్పుడు వాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని, మళ్లీ రెండోసారి సింగరేణి బొగ్గు బాయిల దిగి కార్మికులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని యాదికి తెచ్చుకున్నారు. నాటి జాతీయ సంఘాలు సింగరేణి సంస్థను ఆ పరిస్థితిలోకి తీసుకవస్తే తాను, ఇక్కడున్న టీబీజీకేఎస్ నాయకులమంతా కలిసి కేసీఆర్ దగ్గరకు వెళ్లి చెప్పామని, వెంటనే అప్పటి సీఎండీతో మాట్లాడి సింగరేణిలో నూటికి 95 శాతం డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టి మరీ ఒప్పించిన విషయాన్ని వివరించారు.
సింగరేణికి అంత చేసిన కేసీఆర్‌ను మరిచి కార్మికులు మోసపోవడం చాలా బాధేసిందన్నారు. సింగరేణి సంస్థ, కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న టీబీజీకేఎస్‌ను త్వరలోనే ప్రక్షాళన చేయబోతున్నామని, యూనియన్‌కు కొత్త నాయకత్వాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. కార్మికుల సోదరిగా ఇక తాను ముందుండి కొట్లాడుతానని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిన లేబర్ కోడ్స్ ఎంత భయంకరమో ఒకసారి మీరే అధ్యయనం చేయాలని సూచించారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలనే ఇప్పుడు మూడు జెండాల వాళ్లు తామేదే సాధించినట్లు చెప్పుకోవడం అవివేకమన్నారు. నాడు కేసీఆర్ నైనీ బ్లాక్ ప్రాజెక్టును సింగరేణి సంస్థకు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు భట్టి విక్రమార్క పోయి తామేదో సాధించి తీసుకవచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీబీజీకేఎస్‌పై కార్మికులకు ఉన్న ఆదరణ ఎప్పటికీ తరగదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే సింగరేణిలో గెలుపు ఖాయమన్నారు.
సింగరేణిలో మారుపేర్ల కార్మికులు, ఓవర్మెన్ల సమస్యను పరిష్కరించే బాధ్యత యూనియన్ తీసుకుంటుందన్నారు. అమలు కాని హామీలు, అబద్ధాలతో గెలిచిన సంఘాలకు, పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 25న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని, 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు మన సింగరేణీయులంతా సైన్యంలా కదిలి రావాలని, మరో కుంభమేళాను తలపించాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు ఎమ్మెల్సీ కవితకు సింగరేణి టోపీని తొడిగి ఘనంగా సత్కరించారు. శ్రీరాంపూర్, రామగుండం ఏరియాలకు చెందిన పలు యూనియన్ల నాయకులు టీబీజీకేఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రాంమ్మూర్తి, రాకేశ్, కౌశికహరి, దాసరి ఉష, నూనె కొంరయ్య, పెంట రాజేశ్, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభకు సైన్యంలా కదలాలి
బొగ్గు గనులకు కేంద్రం పెద్దపల్లి జిల్లా. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించింది. సింగరేణి సమ్మె చేస్తూ తట్టా, చెమ్మస్ కింద పడేస్తేనే ఢిల్లీకి ఉద్యమ సెగ తగిలింది. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్. తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తితో పార్టీ పెనవేసుకున్నది. రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తం. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు సైన్యంలా కదలాలి. మరో మహా కుంభమేళాను తలపించాలి. పల్లెపల్లె నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి. రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోవాలి.
– పెద్దపల్లిలో కల్వకుంట్ల కవిత
మన సత్తా చాటాలి
ఉద్యమ సమయంలో తెలంగాణ యాస, భాషను అబాసుపాలు చేస్తున్న సమయంలో మన సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పిన వనిత కల్వకుంట్ల కవిత. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగబోతున్నది. పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలి. మన సత్తా చాటాలి.
– పెద్దపల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
ఉగ్రమూకల దాడి అత్యంత బాధాకరం
అమాయకులపై ఉగ్రమూకలు దాడి చేసి పొట్టన బెట్టుకోవడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు పెద్దపల్లి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్‌కు ముందు నేతలంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.
– కల్వకుంట్ల కవిత