వేములవాడ, ఫిబ్రవరి 26: ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రగతిని ఆపొద్దని, వేములవాడలో అభివృద్ధిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు పెరిగిపోయాయని, సిరిసిల్లలో కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు నిరుపేద టీ స్టాల్ ను తీసేయించిన దుర్మార్గపు సర్కారు కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంత భేదభావం అకరలేదని, తక్షణమే ఇలాంటి కక్షపూరిత వ్యవహారాలను విరమించుకోవాలని, బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని హితవు పలికారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం వేములవాడ రాజరాజేశ్వర స్వా మి వారిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమా ర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి దర్శించుకున్నారు.
అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వర స్వామివారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. వేములవాడ అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ హయాంలో రూ. 250 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ప్ర భుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
బీఆర్ఎస్ హయాం లో రాజన్న ఆలయ విస్తరణ కోసం గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అకడ అభివృద్ధి జరుగడం లేదని స్థానికులు చెబుతున్నారని, వెంటనే పనులను కొనసాగించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందని, చేనేత కార్మికుల కోసం నాడు మంత్రిగా కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని, ఫలితంగా సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని సూచించారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని, అండగా నిలబడాలని డి మాండ్ చేశారు. అంతకు ముందు రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ సుమీత్ర ఆనంద్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ ఎంపీపీలు చంద్రయ్య గౌడ్, గంగమ్ స్వరూప, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, తదితరులు ఉన్నారు.