దాడిని ఎండగడుతం
నేను జగిత్యాలకు రావడానికి పెద్ద కారణమే ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి, బతుకమ్మ లేకుండా మన అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నడు. వాటిని అందరికీ వివరించి చెప్పడానికే వచ్చిన. తెలంగాణ తల్లి కేవలం ఒక్క కేసీఆర్ సృష్టి కాదు. అది సకల జనులు సమ్మిళితంగా రూపొందించుకున్న ఒక పవిత్రభావానికి రూపం. ఉద్యమ సమయంలో ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని రగిలించిన ఆ విగ్రహంలో రేవంత్ బతుకమ్మను తీసేసి, ఉద్యమ స్ఫూర్తిని లేకుండా చేస్తున్నడు. ఆయన సెక్రటేరియేట్‌లో ప్రతిష్ఠించిన మూర్తిని తెలంగాణ తల్లిగా సమాజం అంగీకరించే పరిస్థితిలో లేదు. బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని రూపొందించడం అంటే ఇక్కడి ప్రజలను అవమానించడమే. ఎన్ని జీవోలు, ఎన్ని గెజిట్లు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా సమాజం భయపడబోదు. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని రగిలించిన తెలంగాణ తల్లి విగ్రహాలను పల్లెపల్లెనా ప్రతిష్ఠిస్తం. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడుతం. ఉద్యమతల్లిని కాపాడుకుంటం.
– కల్వకుంట్ల కవిత
జగిత్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘జగిత్యాల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డ అని మరోసారి ప్రజలు నిరూపించిన్రు. ఈ గడ్డకు నా ధన్యవాదాలు’ అని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రగతికి అహర్నిశలూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో జరిగే అవినీతి, అక్రమాలపై అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సుదీర్ఘ సమయం తర్వాత ఆదివారం జగిత్యాలకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్సీ ధరూర్ శివారులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమీపంలోనే 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ చేశారు. మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు.
Kavitha
అనంతరం బైక్‌ర్యాలీతో జగిత్యాలకు చేరుకొని, కొత్తబస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత సారంగాపూర్ కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు. అంతకు ముందు ధరూర్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని, అందరినీ కాపాడుకుంటామని భరోసానిచ్చారు. నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని, కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీకి ద్రోహం చేశాడని, ప్రజలను వదిలిపెట్టిపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు పోయిన ఆయనను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. సంజయ్‌కుమార్ అసెంబ్లీ సమావేశాలకు ఏ ముఖం పెట్టుకొని పోతారో..? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పార్టీ ఎందుకు మారారని అడిగితే ‘పైసల కోసం మారాను’ అని చెబుతున్నారన్నారు.
అయితే జగిత్యాల మహిళలకు మహలక్ష్మి పథకం వచ్చిందా..? వృద్ధాప్య పింఛన్లు పెరిగాయా..? రైతుబంధు వచ్చిందా..? కనీసం ఒక్క చెరువునైనా పూడిక తీశారా..? ఒక్క రూపాయి అయినా వచ్చిందా..? చెప్పాలని ప్రశ్నించారు. ఒక్కరూపాయి మంజూరు చేయనప్పుడు ఆయన పార్టీ ఎందుకు మారారో..? ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే పైసల కోసం పోయానంటున్నాడని, ప్రజలను వదిలి పైసల వెంట పడే వారు ఏనాటికి నాయకులు కాలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్‌ను శ్రమించి గెలిపించారని, ఇప్పుడు పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా, ఆయన పార్టీ మారినా జగిత్యాల ప్రజలు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ప్రచారం చేసినా.. ఆనాడు ఇక్కడి ప్రజలు కేసీఆర్ నిలబెట్టిన డాక్టర్ సంజయ్ కుమార్‌నే గెలిపించారన్నారు. ఆయనది వ్యక్తిగత గెలుపు కాదని, కేసీఆర్ గెలుపుగా చూడాలన్నారు. పార్టీని వదిలిపోయిన వారు పోయారని, రానున్న రోజుల్లో పార్టీ వెంట ఉన్నవారిలో ఎవరో ఒక్కరు ఎమ్మెల్యే అవుతారని చెప్పారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నాయకులు దావ సురేశ్, శివ కేసరి బాబు, దేవేందర్ నాయక్, తురగ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ అనూప్‌రావు, మాజీ జడ్పీటీసీ రాంమోహన్‌రావు, శీలం ప్రియాంక ప్రవీణ్ ఉన్నారు.
‘కస్తూర్బా’లోనూ కామన్ డైట్ మెనూ పాటించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో ఫుడ్‌పాయిజనింగ్ పెరిగింది. రాష్ట్రంలో ఏడాది కాలంలో 47 మంది చిన్నారులు విద్యాసంస్థలో చనిపోవడం అత్యంత బాధాకరం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. గురుకులాల్లో డైట్ మెనూను మార్చింది. కామన్ డైట్ మెనూను రూపొందించడంతోపాటు వాటికి నిధులను సైతం పెంచింది. శనివారం గురుకులాల్లో కామన్ డైట్ మెనూను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నం. అలాగే ప్రజా వ్యతిరేకంగా తీసుకునే ప్రతి నిర్ణయంపైన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తం. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆడపిల్లలు చదివే కస్తూర్బా పాఠశాలల్లోనూ కామన్ డైట్ మెనూను పాటించాలి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇది వరకే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినట్టు.. కస్తూర్బా టీచర్లందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి.
– సారంగాపూర్ కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత