ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవి కోసం పంతుళ్లు అప్పడే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగైనా సీటు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆశావహులు ముందుకెళ్తున్నారు. 2019తో పోలిస్తే ఈసారి పోటీ అధికంగా ఉండే అవకాశమున్నది. అలాగే ఓటర్ల సంఖ్య కూడా పెరుగనున్నది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక నాయకులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొంత మంది బాహాటంగా బయటకు వచ్చి ఒకవైపు ఆయా సంఘాలు, ప్రధాన పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా.. మరికొంత మంది అంతర్గతంగా ప్రయత్నాలు, ప్రచారం సాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే, ఈ విషయం ఉపాధ్యాయవర్గాల్లో హాట్ టాపిక్లా మారగా, ఈసారి అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఓటు వేయాలన్న చర్చ నడుస్తున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ నెల 30 నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీ జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తం రెడ్డి కొనసాగుతున్నారు. రెండు ఎమ్మెల్సీలకు సంబంధించి 2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అందులో పట్టభద్రుల స్థానానికి ఆనాడు 17 మంది పోటీ చేయగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఏడుగురు పోటీ పడ్డారు. అప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌కు చెందిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన చంద్రశేఖర్‌గౌడ్‌పై విజయం సాధించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి పాతూరి సుధాకర్‌రెడ్డిపై 1,707 ఓట్లతో పీఆర్టీయూ మద్దతుదారుడు కూర రఘోత్తం రెడ్డి విజయం సాధించారు. వీరి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుండగా, ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో భాగంగానే ఈనెల 30వ తేదీ నుంచి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగించేందుకు ప్రకటన జారీ అయింది. దీంతో ఔత్సాహిక నాయకులంతా.. ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన పలువురు నేతలు.. ఈ పదవి కోసం పోటీ పడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు ఉపాధ్యాయ సంఘాలు పోటీపడుతుండగా.. మరోవైపు ప్రధాన పార్టీలు సైతం బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న ఆలోచన చేస్తున్నాయి.
ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సిద్దిపేట జిల్లాకు చెందిన కూర రఘోత్తం రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి సైతం ఆయన పీఆర్టీయూ మ్యాండేట్ (మద్దతు) కోసం మళ్లీ ప్రయత్నాలు ఆరంభించారు. అలాగే సిద్దిపేటకు చెందిన వంగ మహేందర్‌రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 20 సంవత్సరాల పాటు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పీఆర్టీయూ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్ రావు పీఆర్టీయూ మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గతంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆరేళ్లు పనిచేసి ఆగస్టులో పదవీ విరమణ పొందారు. అలాగే జాలిమహేందర్రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
పంచాయత్‌రాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులుగా పనిచేసిన మహేందర్‌రెడ్డి, పీఆర్టీయూ మద్దతుతో బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) అలాగే ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి (యూఎస్పీఎస్) ఈ రెండు కూటముల నుంచి ఒక్కో బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక ప్రధాన పార్టీల పరంగా చూస్తే.. వివిధ ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసి అనుభవం ఉన్న ముగ్గురు నాయకులు బీఆర్ఎస్ మద్దతు కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశమున్నది.
కాగా కరీంనగర్‌కు చెందిన పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం బీజేపీలో నార్త్ జోన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న నరహరి లక్ష్మారెడ్డి బీజేపీ మద్దుతుతో పోటీలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్తోపాటు బీజేపీ ప్రధాన నాయకులను కలిసి, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేశారు. అలాగే కరీంనగర్‌కు చెందిన పూలు సత్యనారాయణ అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా బీజేపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే 2019 ఎన్నికల్లో ఎస్టీయూ మద్దతుతో పోటీచేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. ఆయన కూడా ఈసారి బీజేపీ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలు ప్రారంభిచినట్టు సమాచారం.
పాత కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. మొత్తం 15 కొత్త జిల్లాలకు విస్తరించి ఉన్నది. అందులో 13 జిల్లాలు పూర్తిస్థాయిలో ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు హన్మకొండ (2019 ఎన్నికల సమయంలో వరంగల్ అర్బన్‌గా ఉన్నది) జిల్లాలు పాక్షికంగా ఉంటాయి. 2019 ఎన్నికల సమయంలో 23,214 ఓట్లు ఉండగా, అందులో 7,322 మంది మహిళా టీచర్లు, 15,892 మంది పురుష ఉపాధ్యాయులున్నారు. ఈసారి దాదాపు మూడు నుంచి ఐదు వేల ఓట్లు పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జరిగిన రిక్రూట్మెంట్ల నేపథ్యంలో ఈ సారి ఓటర్ల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించడమే కాకుండా, తమకు దగ్గర అనుకున్న వారితో ఎన్రోల్మెంట్ చేయించేందుకు.. ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. అంతేకాదు, ఉపాధ్యాయసంఘాలు సైతం తమ మద్దతుతో బరిలో నిలిచే వారినే గెలిపించేందుకు పక్కా వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో అప్పుడే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. గతంతో పోలిస్తే ఈ సారి పోటీ కూడా అధికంగా ఉండే నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కడుతారన్నది వేచి చూడాలి.