కొడిమ్యాల, మే 23 : కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రైతులకు అడిగే హక్కులేదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులు 500 బోనస్ గురించి అడిగితే.. మంత్రి స్థాయిలో ఉండి “మొరుగుతున్నారు” అనే పదాన్ని వాడి అవమాన పరిచాడని ధ్వజమెత్తారు. బోనస్ అడిగే రైతులను కుక్కలతో పోల్చే ప్రయత్నం చేస్తాడా..? అని మండిపడ్డారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ కూలీలకు 12 వేలు, కౌలు రైతులకు 15 వేలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.
ఇంకా వడ్లకు 500 బోనస్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఈరోజు కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని, ఆఖరికి ధాన్యం కొనేందుకు కూడా ఈ సర్కారుకు చేతనైతలేదని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి రైతుల గుండెలమీద తన్నుతున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. కొడిమ్యాల మండలం పూడూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని త్వరగా తూకం వేస్తలేరని వారు చెప్పడంతో జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. త్వరగా తూకం వేసేలా చూడాలని కోరా రు. రమేశ్, లచ్చిరెడ్డికి చెందిన ధాన్యం తడిసిందని, దానిని తూ కం వేయాలని సూచించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూశారని, 24 గంటల కరెంట్, పంటలకు సరిపడా సాగు నీరు అందించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల ముందు బాండు పేపర్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాసిచ్చారని గుర్తు చేశారు. రైతుల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పెట్టి వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించారని చెప్పారు.
ఇప్పుడు సన్నవడ్ల పేరిట దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వబోమని కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో యాసంగిలో 3,00,723 ఎకరాల్లో వరి వేశారని, అందులో 3,00,073 ఎకరాల్లో దొడ్డు వడ్లు, కేవలం 650 ఎకరాల్లో మాత్రమే సన్నవడ్లు పండించారని చెప్పారు. సన్నవడ్లను రైతు లు తమ ఇంట్లో తినడానికి మాత్రమే పండిస్తారని, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకునేంత పండించారని తెలిపారు. గత యాసంగిలో కేసీఆర్ ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కొన్నది 37 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదన్నారు.
రైతులు కల్లాల్లో ధాన్యం ఉంచుకొని ఓపిక లేక ప్రైవేట్‌కు అమ్ముకోవాల్సి వస్తున్నదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని భరోసానిచ్చారు. అంతకు ముందు కొండగట్టు అంజన్న సన్నిధిలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ ముడుపు కట్టిన ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలువడంతో వచ్చి ఆలయ ప్రాకార మండపంలో పూజలు చేసి, ముడుపును విప్పారు. ఆ తర్వాత ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు.
ఆయాచోట్ల హరీశ్‌రావు వెంట మల్యాల జడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్రావు, తిర్మలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, అయిల్నేని సాగర్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశం, నాయకులు ఎగుర్ల తిరుపతి, బొడ్డు రమేశ్, సురబి సాగర్‌రావు, గడ్డం లక్ష్మారెడ్డి, చింతపంటి ఆదయ్య, రేకులపల్లి తిరుపతిరెడ్డి, ఓల్లా ల లింగాగౌడ్, అక్బర్, గడ్డమీది గంగయ్య, బొలుమాల్ల గంగాధర్, వేణురావు, కొత్తూరి స్వామి, చాంద్‌పాషా పాల్గొన్నారు.
మంత్రులు హైదరాబాద్‌లో ఏసీల్లో కూర్చోవడం కాదు. గ్రామాల్లో తిరిగాలి. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలు చేయిస్తూ భరోసా ఇవ్వాలి. ధాన్యం త్వరగా తూకం వేసేలా చూడాలి. రైతులకు 500 బోనస్ ఇచ్చేవరకు వదలం. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటం. రైతుల కోసం ఉద్యమిస్తం.
– హరీశ్‌రావు
రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తరు. ఒక ఎకరంలో దొడ్డు రకం 27 క్వింటాళ్ల వరకు పండితే.. సన్న రకం 15 క్వింటాళ్ల వరకే పండుతుంది. దాదాపు 7 నుంచి 8 క్వింటాళ్లు పంట దిగుబడి తక్కువగా వస్తుంది. సన్నాలకు రోగాలు ఎక్కువ. పెట్టుబడి ఎక్కువ. నెల రోజుల కాలపరిమితి ఎక్కువ. అయినా సన్నవడ్లు బయట విక్రయిస్తే క్వింటాల్‌కు 2800 నుంచి 3వేల వరకు వస్తయి. అంటే ప్రభుత్వం ఇచ్చే బోనస్‌కు అదనం. ఇది రైతులు చెబుతున్న మాట. సన్నాల పేరిట రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల ముందు బోనస్ గురించి చెప్పలేదు. ఓట్లు వేసిన డబ్బాలు సీల్ కాగానే బోనస్‌ను తెరపైకి తెచ్చింది. రైతులను నిలువునా ముంచుతున్నది.
– హరీశ్‌రావు