గంగాధర/బోయినపల్లి, సెప్టెంబర్ 7: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పేదలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ‘నేనున్నాననే’ భరోసా ఇస్తున్నారు. కడుపేదరికంలో ఉన్న ఇద్దరు దివ్యాంగులైన అన్నాచెల్లెళ్లకు గురువారం ఆర్థిక సాయం అందజేసిన ఆయన, గంగాధరలో ఓ అనాథ బాలికకు 20వేల ఆర్థిక సహాయం ఇచ్చి బాసటగా నిలిచారు.
అనన్యతేజకు భరోసా
పదకొండేండ్ల అనాథ బాలిక అనన్యతేజకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అనన్యతేజ తండ్రి అన్నల్దాస్ భాస్కర్ పదేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లి లావణ్య వారం క్రితం అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో అనన్యతేజ అనాథగా మారింది. ఆ బాలిక దయనీయస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. తక్షణ సాయంగా 20 వేలు అందించారు. భవిష్యత్‌లోనూ ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఆయనవెంట కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, నాయకులు కల్వకోట శ్రీనివాసరావు, అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, మామిడిపెల్లి అఖిల్ ఉన్నారు.
దివ్యాంగులు అండగా
బోయినపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన కళ్యాణం కనుకయ్య-కొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అందులో ఒక బిడ్డ, కొడుకు బాగానే ఉండగా, మరో ఇద్దరు (వేణు, సాగరిక) దివ్యాంగులు. కనుకయ్య దాదా పు 15 ఏళ్ల క్రితం దుబాయిలోనే చనిపోగా, నాటి నుంచి తల్లి కొమురవ్వ కూలీనాలి చేసి పిల్లలను సాదుకుంటున్నది. ఐదారేండ్ల క్రితం పెద్ద బిడ్డ పెండ్లి చేసింది. మరో కొడుకు వెంకటసాయి ఓ షాపులో పనిచేస్తుండగా, దివ్యాంగులైన కొడుకు, బిడ్డకు ఆసరా పెన్షన్ వస్తున్నది. అయితే కొడుకు పనిచేస్తున్నా.. తల్లి కూలిపనికి వెళ్తున్నా వచ్చే అంతంతే ఆదాయంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కొడుకు వెంకటసాయి ఎక్స్ (టిట్టర్)లో ఎమ్మెల్యేకు పోస్టు చేయగా, ఆయన వెంటనే స్పందించారు. గురువారం వారిని గంగాధర మండలం బూర్గుపల్లిలోని తన నివాసానికి పిలిపించుకుని రూ.పది వేల నగదు ఆర్థిక సాయం చేశారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానన్నారు. బీసీ బంధు కింద ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వెంకటసాయికి బీసీ బంధు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సాయంత్రం వెంకటసాయి పనిచేస్తున్న బోయినపల్లిలోని హెయిర్ కటింగ్ షాపునకు వెళ్లి మాట్లాడారు. సొంతంగా షాపు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని చెప్పారు. ఆయనవెంట సర్పంచ్ ఒంటెల గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొంకటి మధు ఉన్నారు.