బోయినపల్లి, నవంబర్ 24: ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చారు. బోయినపల్లి మండలం మల్కాపూర్, తడగొండ, అనంతపల్లి, దుండ్రపలి, కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయని చెప్పారు. ప్రజలు వారి ఎత్తు గడలను తిప్పి కొట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో వచ్చిన అభ్యర్థులు స్థానికులు కాదని, ఈ ప్రాంతంపై వారికి అవగాహన లేదని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కుట్ర పూరిత మాటలు నమ్మి మోస పోవద్దని సూచించారు. మళ్లీ సీఎం కేసీఆర్‌కే పట్టం కడితేనే సంక్షేమ పథకాలు యథావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కు గ్రామాల్లో డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారులు, మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకుడు చెన్నాడి అమిత్‌కుమార్, ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమ, సెస్ డైరెక్టర్ సుధాకర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొండయ్య, సర్పంచులు నరేశ్, రమేశ్, సత్యనారాయణరెడ్డి, కరుణ, రాజ్యలక్ష్మి, లచ్చయ్య, ఎంపీటీసీలు మమత, వనజ, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలున్నారు.