ఇబ్రహీంపట్నం, మే 13: ‘సెంటర్‌కు ధాన్యం వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలులో జాప్యం ఎందుకు చేస్తున్నరు? కాంటా ఎప్పుడు పెడుతరు?’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని వెనువెంటే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరుగుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్పా ఎక్కడ సమర్థవంతంగా సేకరణ చేయడం లేదని దుయ్యబట్టారు.
అకాల వర్షాలు, ఈదురుగాలులతో ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని జిల్లా డీసీవో మనోజ్‌కు సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దశరథ్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నేమూరి సత్యనారాయణ, నాయకులు చిన్నారెడ్డి తొకల శేఖర్, తుక్కారాం, చిన్నరాజన్న, శేఖర్, రైతులు ఉన్నారు.