జమ్మికుంట (హుజూరాబాద్ టౌన్), నవంబర్ 6: ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జమ్మికుంట గుండ్ల చెరువులో చేపపిల్లలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతుండగా, హస్తం నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను దూషిస్తూ రెచ్చిపోయారు. వా గ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు రంగప్రవేశం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లల్లో సగం కూడా ప్రస్తుత సర్కారు పంపిణీ చేయడం లేదన్న విషయాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారని, దాడులకు దిగార ని, ఇదేం సంస్కృతి అని ఆక్షేపించారు. ఎవరికీ భయపడేది లేదని, మత్స్యకారుల తరపున పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తానని స్పష్టం చేశారు.
పూర్తిగా నాసిరకం, అతిచిన్న చేపపిల్లలను చెరువుల్లో పోస్తున్నారని, ఇలా అయితే అవి ఎదిగేది ఎప్పుడు? మత్స్యకారులకు ఉపాధి దొరికేదెన్నడు? అని ప్రశ్నించారు. పంపిణీని ఆలస్యం చేయడమేకాకుండా వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమపై లేనిపోని నిందలు వే స్తున్నారన్నారు. కాంగ్రెస్పాలనపై మత్స్యకార కుటుంబాలు దు మ్మెత్తి పోస్తున్నా చీమ కుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు.
60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ మత్స్యరంగం దారుణ వివక్షకు గురైతే, కేసీఆర్ పదేళ్ల పాలనలో మత్స్యరంగాన్ని అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మాని చేపపిల్లల పంపిణీపై దృష్టి సారించాలని, లేదంటే మత్స్యకార కుటుంబాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తకలపల్లి రాజేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్, అబాది జమ్మికుంట కౌన్సిలర్లు దయాల శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.