హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 30 : హుజూరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డును వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో మంత్రు లు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ డంప్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు ఎదురొనే ఇబ్బందులను వారికి వివరించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశమని తెలిపారు.
గ్రామాలు, పట్టణాలకు సమీపంలో చెత్త నిల్వ చేయడం వల్ల దుర్వాసన, కాలుష్యం పెరుగుతుందని, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని, తద్వారా తాగునీటి సమస్యలు తలెత్తుతాయని, దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లలు, వృద్ధులు, గర్భిణుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, పరిసర ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోతాయని, భూముల విలువ తగ్గుతుందని వివరించారు. హుజూరాబాద్ ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా డంప్ యార్డ్ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించి వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే కోరారు.