కమలాపూర్, నవంబర్ 28 : ‘మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. సంపుకొంటరో.. సాదుకుంటరో మీ ఇష్టం’ అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కమలాపూర్‌లో భార్య శాలిని, కూతురుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. ‘మీ దయ అంటున్నా.. మీ దండమంటున్నా.. మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి’ అంటూ వేడుకున్నారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు భావోద్వేగంతో కౌశికన్న కారు గుర్తుకే మన ఓటు అని నినదించారు. అనంతరం ఖాసింపల్లి, మర్రిపెల్లిగూడెం గ్రామాల్లో కౌశిక్‌రెడ్డి భార్య శాలిని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఇక్కడ సర్పంచ్ కట్కూరి విజయ, ఎంపీపీ రాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.