కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28 : తనుగుల చెక్‌డ్యాం ధ్వంసంపై తాము రాజకీయాలు చేయడం లేదని, రైతుల బాగు కోసమే పోరాటం చేస్తున్నామని, దుండగులకు శిక్ష పడే వరకూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే డీజీపీతోపాటు కేంద్రహోం మంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. రాష్ట్ర సంపదను ఎవరూ ధ్వంసం చేసినా పెద్ద నేరంగా పరిగణించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. చెక్ డ్యాం పేల్చివేత విషయంలో జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని, చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలను నిర్మించి రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఇసుక దందా కోసం చెక్ డ్యాంలను పేల్చివేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
గతంలో హుస్సేన్‌మియా వాగుపై చెక్ డ్యాం పేల్చివేసే కుట్రను రైతులు అడ్డుకున్నారని, ఇప్పుడు అదే ఇసుక దందా కోసం ఈ చెక్ డ్యాంను పేల్చివేశారని విమర్శించారు. రాత్రి పూట పెద్ద శబ్దం వచ్చిందని, చెక్ డ్యాంను దుండగులే బాంబులు పెట్టి పేల్చినట్టు స్థానికులు చెబుతున్నారని, ఈ విషయంపై ఇప్పటికే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. అయితే కేసు విచారణ ఒక్క అడుగు ముందుకు సాగలేదని విమర్శించారు. నాణ్యతాలోపం వల్ల కూలిందని కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే లక్షల క్యూస్కెల వరద వచ్చినప్పుడే ఆ చెక్ డ్యాం కొట్టుకుపోయి ఉండేదన్నారు. ఏ వరద లేనప్పుడు ఎలా కూలిపోతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బృందం పర్యటించినప్పుడు అది వరదతో కూలిపోయిన దాఖలాలు లేవని, బాంబులు పెట్టి పేల్చివేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. అయితే కాంగ్రెసోళ్లు నాణ్యతలేకనే కూలిపోయిందని చెబుతున్నారని, అదే నిజమైతే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు జంగిలి సాగర్, ఐలేందర్, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, సూర్యశేఖర్, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, రాజు, ఆరె రవిగౌడ్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
చెక్‌డ్యాం పేల్చివేతకు ఆధారాలు బయటపెడితే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతామని మీడియా సాక్షిగా సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను మేం స్వీకరించి.. పేల్చివేతకు సంబంధించి అన్నీ ఆధారాలతో వీడియోలు విడుదల చేశాం. ఆయన ఇప్పుడు మాట తప్పడమేకాకుండా.. వందలాది మంది అనుచరులతో కాల్ చేయించి బెదిరింపులకు దిగుతున్నారు. నేను రేవంత్‌రెడ్డికే భయపడలేదు. ఈ బచ్చగాళ్ల ఫోన్లకు ఎలా భయపడుతా..? ఈ చిల్లర వేషాలు ఇలాగే కొనసాగిస్తే మేం కూడా ఇదే విధానంలో ముందుకెళ్లాల్సి వస్తది. విజయరమణారావు ఎప్పుడు రాజీనామా చేస్తున్నావంటూ ఫోన్లు చేయించి అడిగించాల్సి వస్తది. చెక్‌డ్యాం పేల్చివేతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మేం పోరాటం చేస్తున్నామే తప్ప రాజకీయం చేయడం లేదు. కానీ, విచారణ జరపకుండా మమ్మల్నే టార్గెట్ చేయడం చూస్తే.. ఇది కాంగ్రెస్ వాళ్లే చేశారా..? లేక విజయరమణారావు అనుచరులే చేశారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
నాకు ఫోన్ చేసిన వ్యక్తుల కాల్ రికార్డులను డీజీపీకి అప్పగించి విచారణ చేయించాలని కోరుతాం. చెక్‌డ్యాం పేల్చివేతను చూస్తే మేడిగడ్డను కూడా ముమ్మాటికీ పేల్చివేశారనే భావించాల్సి వస్తున్నది. అక్కడ ఓట్ల కోసం మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చివేస్తే.. ఇక్కడ ఇసుక కోసం చేశారు. నిజానికి పేల్చివేతపై మా కంటే ముందుగానే ఇరిగేషన్ డీఈ రవి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక అధికారి అంత స్పష్టంగా చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గతంలో హుస్సేన్‌మియావాగుపై చెక్ డ్యాంను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చడానికి దుండగులు ప్రయత్నించినప్పుడు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కాంగ్రెస్‌కు చెందిన సారయ్యగౌడ్, సుధాకర్‌రెడ్డి ఈ కుట్రలో పాత్రదారులుగా ఉన్నారని పిటిషిన్ ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదు. ఒక వేళ నిజంగానే కాంగ్రెస్ చెబుతున్నట్టు చెక్‌డ్యాం నాణ్యతాలోపంతో కూలిపోతే.. ఆ కాంట్రాక్టు సంస్థకు అధిపతి అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. సదరు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థను బ్లాక్‌లో పెట్టాలి. వాస్తవాలకు విరుద్ధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఎంపీ బండి సంజయ్‌కి ఈ విషయంపై బాధ్యత లేదా..? ఈ చెక్ డ్యాం పేల్చివేతపై విచారణకు సీబీఐని ఎందుకు కోరడం లేదో చెప్పాలి.