MLA KAVVAMPALLY | తిమ్మాపూర్,మే1: సమస్యల పరిష్కారానికే ”ఎమ్మెల్యే ఆన్ వీల్స్” వాహనాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో వాహనాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి అనురాధతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పుకున్నారని, వాటిలో కొన్ని తీర్చేవి కొన్ని తీర్చనివి ఉన్నావన్నారు.
అయితే చాలామంది తమ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని అయోమయంలో ఉంటారని అలాంటి వారి కోసం ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంతో పాటు ప్రత్యేక ఆప్ రూపొందించినట్లు చెప్పారు. ఆ యాప్ లో తమ సమస్యలను విన్నవిస్తే తమ టీం తో పాటు అధికార గణం ఫాలోఅప్ చేసి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. సామాన్య ప్రజలు వ్యయప్రాయాసాలకోర్చి తన వద్దకు రావలసిన అవసరం లేదన్నారు. ఫోన్లో ఆ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన తనకు విన్నవించినట్లేనని స్పష్టం చేశారు. తన స్థాయి కాని సమస్యలను ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లైన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గుండ్లపల్లి లో గురుకుల పాఠశాల దుస్థితిపై ఓ యువకుడు, చావు బతుకుల్లో ఉన్న తన తండ్రిని బతికించుకునేందుకు ఓ కొడుకు తనకు వాట్సాప్ లో చేసిన మెసేజ్ లే ఈ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమ రూపకల్పనకు ప్రేరణ ఇచ్చాయని పేర్కొన్నారు. సమస్యల వినతి ఎలా చేయాలో ప్రజలకు అర్థమయ్యేలా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా 90శాతం సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మానకొండూరు ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలోనే ప్రథమంగా కవంపల్లి సత్యనారాయణ ప్రత్యేక కార్యక్రమం తీసుకువచ్చారని దీని సక్సెస్ కు అధికారులు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో తాసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో విజయ్ కుమార్, పశు వైద్యాధికారి డాక్టర్ సురేందర్ రెడ్డి, ఏవో సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త తిరుపతిరెడ్డి, పోలు రాము, రమేష్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.